న్యూఢిల్లీ: ఆంధప్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ప్రత్యేకహోదా అంశం మరుగున పడిపోయిందని దాని గురించి ప్రస్తావించడం అప్రస్తుతం అంటూ చెప్పుకొచ్చింది. 

ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక సాయం మాత్రమే చేస్తామని స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించామని కూడా కేంద్రం తెలిపింది. పార్లమెంట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కేంద్రాన్ని ప్రశ్నించారు. 

వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థికసంఘం సిఫార్సులతో హోదా అంశం మరుగునపడిందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పరిష్కారం కాని అంశాలపై దృష్టిపెట్టామని తెలిపారు. 

ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్ సభలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సైతం డిమాండ్ చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదేపదే ప్రత్యేక హోదాపై లోక్ సభలో ప్రస్తావిస్తోంది. 

అటు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలను కలిసేటప్పుడు కూడా ప్రత్యేక హోదాపై ప్రస్తావిస్తున్నారు. కానీ కేంద్రంమాత్రం పట్టించుకోవడం లేదు. హోదా ఇచ్చే ఛాన్స్ లేదంటూ తెగేసి చెప్తోంది.