హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ సస్పెన్షన్ వేటుపై సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. మార్చి 11లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

ఇకపోతే శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్నారు. 2009లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విరాభిమాని అయిన శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో శివకుమార్ ఆ పార్టీని వైఎస్ జగన్ కు అప్పగించారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా శివకుమార్ వ్యవహరిస్తున్నారు. పార్టీలో కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అయితే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కాంగ్రెస్ పార్టీకే నని ప్రకటించారు. 

దీంతో ఆగ్రహం చెందిన వైఎస్ జగన్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీలో చర్చించకుండా శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం, పత్రికా ప్రకటన విడుదల చెయ్యడాన్ని ఖండిస్తూ ఆయనను బహిష్కరించారు. ఈ బహిష్కరణపై శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ జనరల్ సెక్రటరీగా మద్దతు పలికానని అందులో తప్పేంటని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఒక పార్టీ వ్యవస్థాపకుడిని బహిష్కరించిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

తనపై విధించిన బహిష్కరణ వేటును ఎత్తివేయాలని లేనిపక్షంలో వైసీపీ నుంచి వైఎస్ జగన్ బయటకు పోవాలి అంటూ అల్టిమేటం జారీ చేశారు శివకుమార్. తాను పెట్టిన పార్టీ నుండి పొమ్మనటానికి మీరెవరు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత శివకుమార్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. 

తనపై బహిష్కరణ వేటును ఎత్తివేయకపోతే ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష చేపడతానని కూడా వార్నింగ్ ఇచ్చారు. న్యాయపోరాటంలో భాగంగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్ జగన్ కు నోటీసులు జారీ చేసింది.