హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణపై జిఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనపైనే కాకుండా ఆయన భార్య శిరీషపై కూడా కేసు నమోదు చేశారు. ఈ స్థితిలో ఎవరీ బొల్లినేని శ్రీనివాస గాంధీ అనే ఆసక్తి చోటు చేసుకుంది. 

గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లో పనిచేసిన గాంధీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులను దర్యాప్తు చేశారు. అదే విధంగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కంపెనీలపై కూడా దర్యాప్తు చేశారు. రాజ్యసభ సభ్యుడైన సుజనా చౌదరి ఇటీవల బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. 

బొల్లినేని ఆస్తులను సోదా చేసిన సిబిఐ అధికారులు రూ. 3.75 కోట్ల అక్రమాస్తులను కనిపెట్టారు. గాంధీ విషయంలో రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రోద్బలంతో గాంధీ తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. 

అప్పటి ఈడి జాయింట్ డెరెక్టర్ ఎస్ఎ ఉమా శంకర్ ఫై,  అసిస్టెంట్ డైరెక్టర్ గాంధీపై 2017 ఫిబ్రవరి 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోడీకి ఫిర్యాదు చేశారు. తన పట్ల వారిద్దరు తనను వేధించే ధోరణిలో, వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ఏ విధమైన ఆరోపణలు లేనప్పటికీ తన సతీమణి వైఎస్ భారతికి వారు ఎలా సమన్లు జారీ చేశారనే విషయంపై కూడా జగన్ ఫిర్యాదు చేశారు. తాను ఎదుర్కుంటున్న కేసులో చార్జిషీట్లు దాఖలు చేసి ఏడేళ్లయిన తర్వాత ఈ సమన్లు జారీ చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్త

జీఎస్టీ అధికారి ఇంటిపై సీబీఐ దాడులు.. 200 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు