విజయవాడ:ఆయేషా మీరా కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక నిర్ణయం తీసుకొంది. ఈ కేసును దర్యాప్తు చేసిన అప్పటి పోలీసులను ప్రశ్నించాలని సీబీఐ భావిస్తోంది.  ఏ కారణాలతో సత్యంబాబును నిందితుడిగా గుర్తించారనే విషయాలపై అప్పటి పోలీసులను సీబీఐ విచారణ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఆయేషా మీరా కేసులో సాక్ష్యాలు ధ్వంసం కావడంతో  ఆ సమయంలో  విచారణ అధికారులుగా పనిచేసిన పోలీసులను ప్రశ్నించి ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టాలని సీబీఐ ప్లాన్ చేసింది.  ఆయేషా మీరా కేసును దర్యాప్తు చేసిన 15 మంది పోలీసు అధికారుల జాబితాను సీబీఐ ఇప్పటికే తయారు చేసింది.ఈ జాబితాఆధారంగా  సీబీఐ అధికారులు  విచారణ చేయనున్నారు.

ఈ కేసులటో తనను ఉద్దేశ్యపూర్వకంగానే ఇరికించారని  సత్యంబాబు ఆరోపణలు చేశారు. అంతేకాదు ఈ కేసులో సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసిన విషయం తెలిసిందే.  ఆయేషా మీరా హత్య జరిగి 11 ఏళ్లు దాటింది. ఈ తరుణంలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకొంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణను సిట్ విచారించింది.

ఈ కేసులో సిట్‌లో ఉన్న అధికారులతో పాటు హత్య జరిగిన సమయంలో దర్యాప్తు జరిపిన  పోలీసు అధికారులను సీబీఐ విచారణ చేసే  అవకాశం ఉంది.  ఫిబ్రవరి మొదటి వారంలో  సీబీఐ అధికారులు విచారణ చేసే అవకాశం ఉంది.