వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ఆయన నివాసాన్ని పరిశీలించిన దర్యాప్తు బృందం... శుక్రవారం పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి పరిశీలించింది.

పదిమందికి పైగా సీబీఐ అధికారుల బృందం వివేకా హత్య జరిగిన ప్రదేశంలో సోదాలు జరిపింది. పులివెందుల టౌన్ ప్లానింగ్ అధికారులు, సర్వేయర్లతో ఇంటి మ్యాప్‌ను సీబీఐ అధికారులు తయారు చేస్తున్నారు.

వివేకా ఇంటి పరిసర ప్రాంతాలన్నింటినీ ఆమె కుమార్తె సునీత దగ్గరుండి సీబీఐ అధికారులకు చూపించారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఓ గది తలుపు తెరుచుకుని ఉన్న విషయాన్ని సునీతి దర్యాప్తు బృందం దృష్టికి తీసుకెళ్లారు.

హత్య జరిగిన బెడ్‌రూమ్, బాత్‌రూమ్‌ను కూడా పరిశీలించారు. ఇంటిపైనా అధికారులు నిశితంగా శోధించారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఇంటి బయట నిద్రిస్తున్న వాచ్‌మెన్ రంగన్నను కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.