హైదరాబాద్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏసీబీ చట్టంలోని 9,13 సెక్షన్ల కింద అభియోగాలు వర్తిస్తాయని సీబీఐ వాదించింది.  జగన్ ఆస్తుల కేసుపై సీబీఐ కోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది.

జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడుల చార్జీషీట్ లో విజయసాయిరెడ్డిపై ఏసీబీ చట్టం కింద అభియోగాలు వర్తిస్తాయని సీబీఐ వాదించింది. ఛార్జీషీట్ దాఖలైన సమయంలో విజయసాయిరెడ్డి ప్రజా ప్రతినిధి కానందున ఏసీబీ చట్టం వర్తించదని ఆయన న్యాయవాది గతంలో వాదించిన విషయాన్ని సీబీఐ న్యాయవాది గుర్తు చేశారు.

ప్రస్తుతం విజయసాయిరెడ్డిపై ఏసీబీ చట్టంలోని 9, 13 సెక్షన్ల కింద అభియోగాలు వర్తిస్తాయని సీబీఐ ప్రత్యేక  పబ్లిక్ ప్రాసిక్యూటర్ తివారీ వాదించారు.  ఈ కేసు విషయమై వాదనలు వినిపించేందుకు తనకు పది రోజుల గడువు ఇవ్వాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ తివారీ కోరారు. జగతి పబ్లికేషన్స్, వాన్ పిక్, రాంకీ, పెన్నా సిమెంట్స్ , భారతీ సిమెంట్స్ చార్జీషీట్లపై విచారణను  సీబీఐ కోర్టు జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.