జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా వేసింది సీబీఐ కోర్ట్. ఈ నెల 14న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. అయితే కోర్టు ఆదేశించినా సీబీఐ లిఖిత పూర్వక వాదనలు సమర్పించకపోవడం గమనార్హం.

అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా వున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో గురువారం విచారణ జరిగింది. దీనిపై ఈ నెల 1న జరిగిన విచారణ సందర్భంగా లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని జగన్, రఘురామకృష్ణంరాజు, సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు జగన్‌, రఘురామ గురువారం కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు సీబీఐకి ఇవాళ మధ్యాహ్నం వరకు గడువునిస్తూ సీబీఐ కోర్టు విచారణ వాయిదా వేయగా.. తాము లిఖితపూర్వక వాదనలు సమర్పించబోమని సీబీఐ తెలిపింది. దీంతో న్యాయస్థానం విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.

జూలై 1న జరిగిన విచారణ సందర్భంగా రఘురామ దాఖలు చేసిన రిజాయిండర్‌పై లిఖితపూర్వక సమాధానం ఇస్తానన్న జగన్‌ అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. పిటిషన్‌ వేసినందున తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని రఘురామ తరఫు న్యాయవాది శ్రీవెంకటేశ్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. కేసులో సాక్షులుగా ఉన్న అధికారులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రలోభ పెడుతున్నారని ఆయన వాదించారు. ఇతర నిందితులకూ ప్రయోజనాలు కల్పిస్తున్నారని కోర్టుకు వివరించారు. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ అభిప్రాయం వెల్లడించకపోవడం సరికాదని రఘురామ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

Also Read:ఇదే లాస్ట్ ఛాయిస్... జగన్ బెయిల్ పిటిషన్ పై సిబిఐ కోర్టు

జగన్‌, రఘురామ వాదనల తర్వాత లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని సీబీఐ... కోర్టుకు తెలిపింది. రఘురామకు పిటిషన్‌ వేసే అర్హత లేదని జగన్‌ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. రాజకీయ ఉద్దేశాలతోనే పిటిషన్‌ వేశారని వాదించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. జగన్‌, రఘురామ, సీబీఐ లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది.