హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై నమోదైన కేసుల విచారణ ఈ నెల 12వ తేదీకి వాయిదా పడింది.

శుక్రవారం నాడు ఈ కేసుల విచారణను కోర్టు చేపట్టింది. ఈ కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపును కోరుతూ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసుల విచారణ ప్రతి శుక్రవారం నాడు జరిగేది. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణను వెంటనే పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసు విచారణ ఇక నుండి రోజువారీ సాగనుంది. దీంతో కేసు విచారణ సోమవారానికి వాయిదా వేసింది కోర్టు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసు విచారణ సాగించాలని జగన్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.  

జగన్ కేసులో నాలుగు చార్జీషీట్లకు సంబంధించి హైకోర్టులో స్టే ఉంది. స్టే కేసుల విచారణను నవంబర్ 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా సీబీఐ కోర్టు ప్రకటించింది. ఇతర కేసుల విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.