జగన్‌ అక్రమాస్తుల కేసులకు సంబంధించి గురువారం సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. మొదట ఈడీ కేసులు విచారణ జరపాలన్న తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయన దాఖలు చేసిన మెమోపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అభ్యంతరం తెలిపింది. 

జగన్‌ అక్రమాస్తుల కేసులకు సంబంధించి గురువారం సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. మొదట ఈడీ కేసులు విచారణ జరపాలన్న తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయన దాఖలు చేసిన మెమోపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అభ్యంతరం తెలిపింది. విజయసాయిరెడ్డి గత మూడు వాయిదాల్లో ఇదే విషయం చెబుతున్నారని, అభియోగాల నమోదుపై వాదనలకు సిద్ధంగా ఉన్నామని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈడీ కేసుల్లో అభియోగాల నమోదుపై వాదనల కోసం విచారణ ఈనెల 20కి వాయిదా పడింది.

అటు ఇండియా సిమెంట్స్‌ కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ జరిగింది. జగన్‌, విజయసాయి పిటిషన్లపై కౌంటరు దాఖలుకు సీబీఐ సమయం కోరింది. విశ్రాంత ఐఏఎస్‌ శామ్యూల్‌ డిశ్ఛార్జ్‌ పిటిషన్‌పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. శామ్యూల్‌ను ఛార్జిషీట్‌ నుంచి తొలగించవద్దని కోరింది. అనంతరం ఇండియా సిమెంట్స్‌ కేసు విచారణ ఈనెల 17కి వాయిదా పడింది. ఇకపోతే సీబీఐ కోర్టులో ఓబుళాపరం గనుల కేసుపై విచారణ జరిగింది. డిశ్ఛార్జ్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించకపోతే తగిన ఉత్తర్వులు ఇస్తామని ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి కోర్టు స్పష్టం చేసింది. అభియోగాల నమోదుపై లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తామని సీబీఐ తెలిపింది. ఓఎంసీ కేసు విచారణ ఈనెల 13కి వాయిదా పడింది.