కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. రెండురోజుల క్రితం తొండంగిలో దారుణ హత్యకు గురైన జర్నలిస్ట్ తాతా సత్యనారాయణ హత్య కేసు నేపథ్యంలో దాడిశెట్టి రాజాపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

జర్నలిస్ట్ తాతా హత్య కేసులో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను అనుమానిస్తూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతోపాటు మరో ఐదుగురిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు.  

ఈ కేసులో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను ఆరో నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఇకపోతే రెండు రోజులక్రితం తాతా సత్యనారాయణ అత్యంత కిరాతకంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

అటు జర్నలిస్ట్ హత్యపై ప్రభుత్వం సైతం సీరియస్ గా ఉంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సైతం స్పందించారు. జర్నలిస్ట్ హత్యకు సంబంధించి విచారణ చేపట్టాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.