గన్నవరం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు కేసుల్లో ఇరుక్కుని పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. 

తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కేసులో ఇరుక్కున్నారు. తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటర్లకు నకిలీ పట్టాలు అందజేశారన్న ఆరోపణల నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు.   

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఓటర్లకు నకిలీ పట్టాలు అందచేశారని బాపులపాడు తహాశీల్ధార్ నరసింహారావు హనుమాన్ జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓటర్లకు పంపిణీ చేసిన పట్టాలలో తహాశీల్థార్ సంతకం ఫోర్జీరీ చేశారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. 

2019 ఎన్నికల సమయంలో గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ వేల సంఖ్యలో నకిలీ ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. బాపులపాడు మండలంలోని పెరికీడు, కొయ్యూరు, కోడూరుపాడు లోని పలు గ్రామాల్లో వేల సంఖ్యలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్టు ఫిర్యాదులో తెలిపారు.  

ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తోపాటు ఆయన ప్రధాన అనుచరుడు రంగాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమాన్ జంక్షన్ లో ఇద్దరు నేతలపైనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే తహాశీల్థార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని అలాగే ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లు పోలీసుల నిర్థారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే వల్లభనేని వంశీమోహన్ కోర్టులో ఒక కేసును సైతం ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో గెలిచారంటూ హైకోర్టును ఆశ్రయించారు గన్నవరం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. 

ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే వంశీమోహన్, ఆయన అనుచరులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని తహాశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారంటూ ఆయన హైకోర్టులోని పిటీషన్లో పేర్కొన్నారు. 

అంతేకాదు ఓట్ల లెక్కింపు కూడా చట్టవిరుద్ధంగా జరిగిందని యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. అందువల్లే తాను స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం చవిచూడాల్సి వచ్చిందని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో హైకోర్టు న్యాయమూర్తి ఎమ్మెల్యే వంశీమోహన్ తోపాటు రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే సార్వత్రిక ఎన్నికల అనంతరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీల మధ్య పెద్ద వివాదమే నడిచింది. వంశీ అనుచరులు తన ఇంటికి వచ్చి బెదిరించారంటూ యార్లగడ్డ సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. 

అయితే కీలక రాజకీయ నేతలు రంగంలోకి దిగడంతో ఆ గొడవ కాస్త సద్దుమణిగింది. తాజాగా మరో కేసు నమోదు కావడంతో బెజవాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వల్లభనేని వంశీపై కేసును ఎలా పరిగణిస్తుందో చూడాలి. 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల నేపథ్యంలో మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి కూడా తెలిసిందే.

మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావుతోపాటు దెందులూరు మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, కలమట వెంకటరమణ, మాజీ విప్ కూన రవికుమార్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. రవికుమార్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అరెస్టు నుంచి తప్పించుకోగా చింతమనేని ప్రభాకర్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు.