ఓ కారు వాగులో చిక్కుకుపోయింది. అప్పటికే ఆ ప్రాంతమంతా చీకటి పడిపోయింది. దీంతో.. దిక్కుతోచలేని పరిస్థితి.  ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ రాత్రంతా కారులోనే నరకయాతన అనుభవించారు ఇద్దరు యువకులు. ఏపీ రాష్ట్రం విశాఖపట్నంకు చెందిన రాంకుమార్, రాజేశ్‌ కారులో జనగామ జిల్లా నర్మెట్లకు బయలు దేరారు.


గురువారం అర్ధరాత్రి మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ సమీపంలోని గుంజేడు వాగు వద్దకు చేరుకున్నారు. వరద ప్రవాహాన్ని గమనించక ముందుకెళ్లారు. అయితే, కారు లోలెవల్‌ బ్రిడ్జి పైనుంచి వాగులోకి వెళ్లే క్రమంలో చెట్టును ఢీకొట్టి ఆగింది. దీంతో వరద నీటి నుంచి బయటకు రాలేక రాత్రంతా వారిద్దరూ కారులోనే ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున చేరుకుని వారిద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.