నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. సెల్ ఫోన్ మాట్లాడుతూ మితిమీరిన వేగంతో డ్రైవ్ చేయడంతో కారు ప్రమాదానికి గురై శివరామకృష్ణ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కారు సాగునీటి కాలువలోకి దూసుకెళ్లడంతో అతడు కారుతో సహా జలసమాధి అయ్యాడు. 

ఈ ప్రమాదానికి  సంబంధించి పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన  వివరాలిలా ఉన్నాయి. నిడదవోలు కు చెందిన శివరామకృష్ణ(27) కారు డ్రైవర్. అతడు గురువారం రాత్రి ఒంటరిగా కారు తీసుకుని పనిమీద భీమవరం బయలుదేరాడు. అయితే అతడు ప్రయాణిస్తున్న కారు విజ్జేశ్వరం వద్ద ప్రమాదానికి గురయ్యింది. అతివేగంతో వెళుతున్న కారు అదుపుతప్పి  పశ్చిమ డెల్టా కాలువలో పడి మునిగిపోయింది. దీంతోపాటే డ్రైవింగ్ చేస్తున్న శివరామకృష్ణ కూడా నీటిలో మునిగిపోయాడు. 

అయితే చివరిసారిగా తల్లికి ఫోన్ చేసిన అతడు తాను ప్రమాదానికి గురయినట్లుగా తల్లికి తెలియజేశాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించారు. అయితే వారు ప్రమాద స్థలానికి చేరుకునేసరికి కారు పూర్తిగా కాలువలో మునిగిపోయి వుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సాయంతో దాన్ని వెలికితీశారు. అయితే అప్పటికే శివరామకృష్ణ మృతిచెందాడు. దీంతో అతడి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.