కర్నూలు: కరోనావైరస్ నివారణకు పారాసిటమాల్ వాడితే సరిపోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై బిజెపి నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జగన్మోహన్ రెడ్ిడకి నోబెల్ బహుమతి ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. 

జగన్ తానే శాస్త్రవేత్త అన్నట్లు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన అన్నారు. కరోనావైరస్ వ్యాపిస్తుండడంతో స్థానిక ఎన్నికలను నిర్వహించకూడదని తాను రెండు రోజుల క్రితమే తాను ఎన్నికల సంఘాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను వాయిదావేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రియల్ హీరో అని ఆయన కొనియాడారు. 

కరోనా వైరస్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడిన అంశాల క్లిప్పింగ్స్ ను రాష్ట్రపతికి, గవర్నర్ కు, డబ్ల్యూహెచ్ వోకు, విదేశీ ఆరోగ్య సంస్థలకు పంపిస్తానని ఆయన చెప్పారు. 

ప్రజలు చచ్చినా ఫరవాలేదు గానీ తాను రాజకీయ ప్రయోజనం పొందాలని జగన్ భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో మీడియా సమావేశం ఏర్పాటుచేసి కరోనాపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయానలి ఆయన కోరారు.

జగన్ కమ్మ సామాజికవర్గంపై పడ్డారని, కమ్మ సోదరులు మేల్కోవాలని ఆయన అన్నారు. కమ్మ సోదరుల పోరాటానికి తాను మద్దతు ఇస్తానని ఆయన చెప్పారు వ్యాపారాల కోసం జగన్ కు కమ్మ కులం కావాలి గానీ రాజకీయంగా వద్దా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కు జగన్ నుంచి ముప్పు ఉందని, ఆయన భద్రతను పెంచుకోవాలని బైరెడ్డి అన్నారు.