నీళ్లు రావడం లేదని ఫిర్యాదు చేసినందుకు కాల్చిపారేస్తానని రౌడీయిజం చేశాడో ఓ బిల్డర్. వివరాల్లోకి వెళితే విశాఖ కంచరపాలెంలో సత్యానంద్ అనే బిల్డర్ హ్యాపీ హోం అనే పేరు మీద 380 ప్లాట్లతో వెంచర్ వేసి పలువురికి విక్రయించాడు.

సుమారు రూ.50 నుంచి రూ.60 లక్షలు పెట్టి కొందరు వాటిని కొన్నారు. అయితే తాగునీరు, విద్యుత్, భద్రత వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో.. అపార్ట్‌మెంట్ వాసులు బిల్డర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. కానీ అతను పట్టించుకోకపోవడంతో నిన్న రాత్రి అపార్ట్‌మెంట్ వాసులంతా ఒక యూనియన్‌లా ఏర్పడి సమావేశం నిర్వహించారు.

విషయం తెలుసుకున్న బిల్డర్ సత్యానంద్ అక్కడి చేరుకున్నాడు. మరోసారి మౌలిక సదుపాయాలపై జనం నిలదీయడంతో అతను ఆగ్రహంతో ఊగిపోయాడు.. వుంటే వుండండి.. లేదంటే వెళ్లిపోండి అంటూ దూర్భాషలాడాడు. మహిళలతోను అసభ్యకరంగా తిడుతూ.. తుపాకీ బయటకు తీసి కాల్చిపారేస్తానని హెచ్చరించాడు. దీంతో బాధితులంతా కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో బిల్డర్‌పై ఫిర్యాదు చేశారు.