ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ల లీకేజ్ ఘటనలో టీడీపీ సీనియర్ నేత నారాయణను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. లీకేజ్ పాపాన్ని నారాయణపై వేసే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైరయ్యారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం సాధారణ విషయంగా మారిపోయిందని అశోక్ గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ (ssc question paper leake) వ్యవహారంలో మాజీ మంత్రి, టీడీపీ (tdp) సీనియర్ నేత నారాయణ అరెస్ట్ (narayana arrest) వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. దీనిపై టీడీపీ నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న (buddha venkanna) మాట్లాడుతూ.. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకుందని దుయ్యబట్టారు. ఆ పాపాన్ని నారాయణపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారని వెంకన్న ఆరోపించారు. ఈ అరెస్ట్ వెనుక సీఎం జగన్ (ys jagan) కుట్ర ఉందని .. అక్రమ అరెస్టులకు తాము భయపడే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.
మరోవైపు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు (ashok gajapathi raju) మాట్లాడుతూ.. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం సాధారణ విషయంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. తనపై, కళా వెంకట్రావుపై కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో 150కి పైగా ఆలయాలపై దాడులు జరిగితే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని అశోక్ గజపతి విమర్శించారు. జగన్ ప్రజాహితం కోసం కాకుండా అధికార దుర్వినియోగం కోసం పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో పలుచోట్ల అవకవతవకలు చోటుచేసుకోవడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పరీక్షలు ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షమయ్యాయి. పలుచోట్ల ప్రశ్నపత్రాల లీకేజ్ కేసుల్లో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, తిరుపతిలోని నారాయణ స్కూల్స్ బ్రాంచీలో టెన్త్ క్లాస్ తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయింది. నారాయణ స్కూల్ కి చెందిన గిరిధర్ అనే టీచర్ లీక్ చేశారని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి డీఈవో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గిరిధర్‌తో పాటు పలువురని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే నారాయణను మంగళవారం ఉదయం ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోని నారాయణ నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏపీకి తరలిస్తున్నారు. అయితే నేడు నారాయణ నివాసంలో ఆయన కుమారుడు నిషిత్ వర్దంతి కార్యక్రమం జరగాల్సి ఉంది. కుమారుడి వర్దంతి కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే నారాయణను పోలీసులు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈవిధంగా తీసుకెళ్లడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, నారాయణ కుమారుడు నితీష్.. ఐదేళ్ల క్రితం ఇదే రోజు హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
ఇదిలా ఉంటే ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షల్లో పేపర్స్ లీకేజీకి సంబంధించి శ్రీచైతన్య స్కూల్స్ పాత్ర కూడా ఉందని స్వయంగా సీఎం జగన్ ఇటీవల తిరుపతి సభలో తెలిపారు. వ్యవస్థను నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు.
