Asianet News TeluguAsianet News Telugu

మమ్మల్ని చంపడానికి విజయసాయి ప్రయత్నాలు...ఆ ఫోన్ కాల్స్ అందుకే: బుద్దా సంచలనం

వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి తానే ముఖ్యమంత్రి అని ఫీలవుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. 

Budda Venkanna Sensational comments on Vijayasai Reddy
Author
Amaravathi, First Published Apr 21, 2020, 8:13 PM IST

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డా లేక విజయసాయి రెడ్డా అనే అయోమయంలో ప్రజలు ఉన్నారని... తానే ముఖ్యమంత్రి అనే స్థాయిలో విజయసాయి మాట్లాడుతున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు. విజయసాయి మాటలు విని మందుబాబులు కూడా తమకు ముఖ్యమంత్రి ఎవరన్న  డైలామాలో ఉన్నారన్నారు. ఆయన ప్రవర్తన చూసి వైసీపీ ఎంపీలు కూడా ఇలాంటి వ్యక్తిని తమకు నాయకుడిగా పెట్టారేంటా అని తలలు పట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. 

''కరోనా బారినుంచి ప్రజలను రక్షించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ వాళ్లు బహిరంగ సభల్లో పాల్గొనడమే కాకుండా దాతలు ఇచ్చిన సాయాన్ని కూడా వారి ఖాతాలో వేసేసుకుంటున్నారు. లాక్ డౌన్ ఉల్లంఘిస్తూ వైసీపీ జెండాలు పట్టుకుని గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. పోలీసులను బెదిరించి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతున్నారు. ఓ వైసీపీ ఎమ్మెల్యే బెంగుళూరు నుంచి బంధుగణంతో వస్తూ పట్టుబడ్డారు. లాక్ డౌన్ నిబంధనలను అధికార పార్టీ నేతలు తుంగలో తొక్కుతన్నారు. అందువల్లే ఏపీలో రోజురోజుకి కరోనా పెరుగుతోంది'' అని వెంకన్న ఆరోపించారు.

''ముందుగా వైసీపీ నాయకులను ఇళ్లకు పరిమితం చేయండి. ఏదైనా సాయం చేయాలంటే స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు అందివ్వండి. విజన్ ఉన్న లీడర్ గా చంద్రబాబు ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబును తలుచుకుంటున్నారు. ఆయన ఉంటే కరోనాను తరిమేవారని అనుకుంటున్నారు. చంద్రబాబు ఏపీలోకి రాకుండా వైసీపీ కుట్రలు చేస్తోంది. అమరావతి రావాలంటే 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని చెబుతున్నారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ఏపీ ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. పేదలకు ఇబ్బందులు రాకుండా నిత్యావసరాలు అందించమని మాకు సూచించారు'' అని అన్నారు.

''పుట్టినరోజునాడు కూడా చంద్రబాబు ప్రజాసేవకే అంకితమయ్యారు. కానీ ముఖ్యమంత్రి పీఠం కోసం అధికారం కోసం సొంత బాబాయి హత్య కేసునే విచారణ చేయించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. బాబాయిని హత్య చేయించింది ఎవరో తెలిసి కూడా చర్యలు తీసుకోవడం లేదు. అధికారం ఉందికదా ఏం చేసినా చెల్లుతుందనే భావనలో ఉన్నారు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురుచూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డని ప్రతి ఒక్కరికీ తెలుసు'' అని  విమర్శించారు.

''కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ కిట్ల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారు. మాజీ ఎస్ ఈసీ రమేష్ కుమార్ ను కులంపేరుతో దూషించారు. కులం పేరుతో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుంటే కులగజ్జి ఎవరికి ఉన్నట్టు? రాజ్యసభ సభ్యుడై ఉండీ  విజయసాయి రెడ్డి కులం గురించి మాట్లాడొచ్చా? వైసీపీ నాయకులు ఏమైనా మాట్లాడొచ్చు. చంద్రబాబును, రమేష్ కుమార్ ను ఏమైనా మాట్లాడొచ్చా'' అని  నిలదీశారు. 

''ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే మమ్మల్ని చంపేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారు.  ప్రతిరోజూ ఫోన్ కాల్స్ తో బెదిరిస్తున్నారు. మేము చావుకు కూడా రెడీగా ఉన్నాము. ప్రజల కోసం నిత్యం పోరాడమని మా నాయకుడు చంద్రబాబు మాకు చెప్పారు. మేము బెదిరింపులకు భయపడం'' అని అన్నారు.

''ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని విజయసాయి ఆరోపిస్తున్నారు. లాక్ డౌన్ ఉల్లంఘించి విజయసాయి పదే పదే విశాఖలో తిరగడం నిజం కాదా? విశాఖ జిల్లాతో మీకేంటి సంబంధం? ప్రశాంతంగా ఉన్న విశాఖను అతలాకుతలం చేయడానికి వెళుతున్నారా? రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో మాట్లాడాలి కానీ మీకు విశాఖలో ఏం పని? మీ సాక్షిలో ఇష్టమొచ్చినట్టు వార్తలు రాస్తుంటే మరి మీదేం మీడియా? మీరు విమర్శిస్తున్న ఎల్లో మీడియాలో టీడీపీ నేతల గురించి ఎన్ని వార్తలు రాశారో మీకు తెలియదా?'' అని ప్రశ్నించారు.

''తప్పు చేసినప్పుడు వార్తలు రాస్తే దాన్ని ఎల్లో మీడియా అంటారా? విశాఖలో కరోనా కేసులు పెరగడం నిజం కాదా?  సరుకులు వాలంటీర్ల ద్వారా పంపడం చేతకాలేదు ఈ ప్రభుత్వానికి. కరోనా వ్యాప్తికి అధికార పార్టీ నేతలే కారణం. ప్రజలంతా గమనిస్తున్నారు. కరోనా లెక్కలన్నీ తప్పుడు తడకలే. రాష్ట్రంలో కరోనా బాధితులు ఎందరున్నారో ప్రజలకు తెలుసు. గుంపులుగుంపులుగా జనంలోకి వెళ్లి కరోనాను మరింత వ్యాపింపచేయొద్దని చేతులెత్తి వేడుకుంటున్నాం'' అని  పిలుపునిచ్చారు. 

''బుద్దా వెంకన్నను చంపేయాలి, బెదిరిద్దాం అని మీరు అనుకోకండి. నేను మీ బెదిరింపులకు బెదరను. ఇక్కడ తెలుగుదేశం సైనికులం. విజయమో వీర మరణమో . రాజకీయాలను రాజకీయాలుగానే చూడండి. మనుషుల ప్రాణాలు తీద్దామనే ఆలోచనలను విరమించుకోండి''  అని ఎమ్మెల్సీ వెంకన్న సూచించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios