గుంటూరు: మాజీ సీఎం, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడితే వైసిపి నాయకులు ఎందుకంత ఉలిక్కిపడుతున్నారని టిడిపి అధికారప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నిలదీశారు. ముఖ్యంగా ఎంపీ విజయసాయి రెడ్డి దీనిపై గుడ్డలు చించుకుంటున్నాడని బుద్దా మండిపడ్డారు.  

''పారిశుద్ధ్య కార్మికులతో, నర్సింగ్ సిస్టర్లతో, కరోనా నుంచి కోలుకున్న వారితో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. నిత్యం ఎంతో మందికి ఫోన్లు చేసి ప్రశంసించారు, పరామర్శించారు కానీ వైఎస్ జగన్ గారితో వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడలేదు అని ఎంపీ విజయసాయి రెడ్డి గారికి అనుమానం రావడం, కోపం కట్టలు తెంచుకోవడం సహజమే. దానికి కారణం నేను చెబుతా. పేరాసిట్మాల్ వేస్తే తగ్గిపోతుంది, బ్లీచింగ్ వేస్తే చచ్చిపోతుంది, కరోనా పెద్ద విషయం కాదు వస్తుంది, పోతుంది అని జగన్ గారు సెలవిచ్చారు'' అంటూ సోషల్ మీడియా వేదికన జగన్, విజయసాయి రెడ్డిలపై సెటైర్లు విసిరారు బుద్దావెంకన్న. 

''ఎన్నికలు నిర్వహణే ముఖ్యం ప్రజలు ప్రాణాలు పోతే నాకేంటి అన్నట్టు వ్యవహరించారు. లాక్ డౌన్ కొనసాగించడానికి వీలులేదు అంటూ అజ్ఞాన ప్రదర్శన ఇచ్చారు. ఇంత మూర్ఖంగా వ్యవహరించే వాడికి ఫోన్ చేసి కరోనా అంటించుకోవాలనే కోరిక ఎవరికి ఉంటుంది పాపం'' అని అన్నారు.
 
''కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీ గారు ప్రతిపక్ష నేత చంద్రబాబు గారికి ఫోన్ చేస్తే వైకాపా నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి
గారు గుడ్డలు ఎందుకు చించుకుంటున్నారు. ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంట్ అంటూ...ఫ్రంట్ గెలిస్తే జగన్ గారే ఉప ప్రధాని అంటూ మీరు ఇచ్చిన బిల్డప్ మర్చిపోయారా? ఎంపీలను గెలిపించండి మోడీ మెడలు వంచుతాం అని ప్రజలు ఓట్లేసిన తరువాత పోటీపడి మరీ మోదీ గారి కాళ్ళ మీద జగన్ గారు పడిన విషయం గుర్తులేకపోతే ఎలా సాయి రెడ్డి సాబ్'' అని వెంకన్న మండిపడ్డారు.