Asianet News TeluguAsianet News Telugu

పంచాయతీ బరిలో బీటెక్ విద్యార్థిని.. ఉద్యోగం వదిలేసి..

క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో ఉద్యోగం వచ్చినప్పటికీ.. దానిని వదులుకొని మరీ ఆమె ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం

Btech student in Local body elections
Author
Hyderabad, First Published Feb 8, 2021, 9:47 AM IST

పంచాయతీ ఎన్నికల బరిలో ఓ బీటెక్ విద్యార్థిని కూడా నిలుచుకుంది. క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో ఉద్యోగం వచ్చినప్పటికీ.. దానిని వదులుకొని మరీ ఆమె ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో కావలి మండలంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కావలి మండలం చలంచర్ల గ్రామానికి చెందిన ఇరువూరి అనూష పంచాయతీ సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేసింది. ప్రచారంలోనూ దూసుకెళుతోంది. ఇటీవల బీటెక్‌ పూర్తిచేసిన ఆమెకు క్యాంపస్‌ ఎంపికల్లో ఉద్యోగం వచ్చింది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. దీంతో ఆమె ఉద్యోగానికి వెళ్లకుండా గ్రామసేవ చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా అందరి మద్దతుతో నామినేషన్‌ దాఖలు చేసింది. 

కాగా.. సీఎం జగన్ స్ఫూర్తిగానే తాను ఎన్నికల్లో నిలిచానని ఆమె చెప్పడం గమనార్హం. ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా అందరికీ అవసరమైన వినూత్న పథకాలు అమలు చేస్తూ సమాజంలో సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు.  గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వాన్ని గ్రామాల్లోని చిట్టచివరి ఇంటివరకు చేర్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని గ్రామంలోని ప్రజలకు చేర్చాలనే లక్ష్యంతో సర్పంచ్‌గా పోటీచేయాలనుకున్నాను. ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. గ్రామస్తుల ఆశీస్సులతో సర్పంచ్‌గా గెలవగానే.. చలంచర్ల పంచాయతీని ఆదర్శ పంచాయతీగా అభివృద్ధి చేయడమే నా ధ్యేయం.  ’ అని ఆమె పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios