కడప: తెలుగుదేశం పార్టీ నేత బిటెక్ రవి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. పులివెందులలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా ఆయన నిలుస్తున్నారు. 

వైఎస్ కంచుకోటను బద్దలు కొట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిటెక్ రవి విజయం సాధించారు. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిపై పోటీ చేసి ఆయన అనూహ్యంగా విజయం సాధించారు. అప్పట్లో కడప జిల్లా టీడీపీ నేతలుగా ఉన్న ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి ఇద్దరు కూడా బిటెక్ రవి పేరును ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించారు. 

మూడు రాజధానుల బిల్లుకు, సీఆర్డీఎ బిల్లుకు గవర్నర్ శుక్రవారం ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. దీంతో విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అమరావతి కేవలం సచివాలయ రాజధానిగానే ఉంటుంది. దీన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది.