ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ నాయకులు తోట చంద్రశేఖర్, రావెల కిషోర్‌బాబు, పార్థసారథిలు శుక్రవారం హైదరాబాద్‌లో కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితను కలిశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఏపీకి చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకోగా.. అక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను సీఎం కేసీఆర్ నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ నాయకులు తోట చంద్రశేఖర్, రావెల కిషోర్‌బాబు, పార్థసారథిలు శుక్రవారం హైదరాబాద్‌లో కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో కలిశారు. ఏపీలో పార్టీ విస్తరణ, తాజా రాజకీయ పరిణామాలు తదితర విషయాలను వారు కవితతో చర్చించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ కూడా పాల్గొన్నారు. 

అలాగే ఏపీలో బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభం, పార్టీ బహిరంగ సభ నిర్వహణపై నేతలతో కవిత చర్చించారు. ఈ సమావేశం సందర్భంగా ఏపీలో బీఆర్ఎస్ విజయవంతం కావాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. త్వరలోనే తాను ఏపీలో పర్యటించనున్నట్టుగా చెప్పారు. 

ఇదిలా ఉంటే.. శనివారం హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత.. బోగీ మంటలను వెలిగించారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి నుంచి భారత్‌ జాగృతిగా రూపాంతరం చెందాక మొదటి సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సంక్రాంతి అంటేనే సంస్కృతి, సంప్రదాయాలకు నిలువటద్ధమని చెప్పారు. పాత ఆలోచనలు భోగి మంటల్లో వేసి.. కొత్త ఆలోచనలకు నాంది పలకడం ఈ పండుగ ఉద్దేశమని అన్నారు. 

ఇక, భారత్ జాగృతిగా దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌కు తోడుగా తాము ప్రజల్లోకి వెళ్లనున్నట్టుగా కవిత ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ జాగృతి తరహాలోనే భారత్ జాగృతిని కూడా రిజిస్టర్ చేశామని కవిత చెప్పారు. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలకు భారత్ జాగృతి తన కార్యకలాపాలను విస్తరిస్తుందని తెలిపారు. తెలంగాణలో మాత్రం తెలంగాణ జాగృతిగానే పనిచేస్తామని చెప్పారు.