రక్తసంబంధాన్ని మరిచి ఆస్తికోసం తోబుట్టువు అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు ముగ్గురు సోదరులు. ఈ దారుణం పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

గురజాల : బావ బాగు కోరుకునేవాడు బామ్మర్ది అంటుంటారు. బావ బాగుపడితే మెట్టినింట్లో అక్కకూడా సుఖంగా వుంటుంది... కాబట్టి సోదరిపై ప్రేమతో ఇలా కోరుకునేవారు. కానీ నేడు ఈ ప్రేమానురాగాలు కనుమరుగయ్యాయి. రక్త సంబంధాల కంటే ఆర్థిక బంధాలే ఎక్కువయ్యాయి. ఇలా అక్క కుటుంబంతో తలెత్తిన ఆస్తి తగాదాలు తమ్ముళ్లను మృగాలుగా మార్చాయి. అక్క కుటుంబంపై కోపంతో రగిలిపోయిన సోదరులు అత్యంత అమానుషంగా వ్యవహరించాడు. అక్కాబావతో పాటు మేనల్లుళ్లపై అతి కిరాతకంగా దాడిచేసి చివరకు తోబుట్టువును పొట్టనపెట్టుకున్నారు. మానవసంబంధాలకు మచ్చలా మిగిలే ఈ అమానుషం పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ముగ్గురు అన్నాదమ్ముళ్లకు సోదరితో ఆస్తి తగాదాలున్నాయి. దీంతో వీరిమధ్య ప్రేమానురాగాలు ఎప్పుడో కనుమరుగై కక్షలు కార్పన్యాలు పెరిగాయి. నిత్యం అక్కాబావతో ముగ్గురు సోదరులు ఆస్తి విషయంలో గొడవపడుతుండేవారు. ఇటీవల ఈ గొడవలు మరింత ముదిరి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకునే స్థాయికి చేరుకున్నాయి. 

దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో అక్కా తమ్ముళ్ళు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువర్గాలు రక్తసంబంధీకులే కావడంతో పోలీసులు నచ్చజెప్పి పంపించారు. కానీ ఇరువర్గాలు రాజీపడకుండా మరోసారి పరస్పర దాడులకు తెగబడి చివరకు ఒకరి ప్రాణాలను బలితీసుకున్నారు.

read more రాత్రి తల్లిదండ్రులతో మాట్లాడాడు... పొద్దుటికి శవమై తేలాడు... మిస్టరీగా విద్యార్థి మృతి..

అక్కాబావతో పాటు మేనల్లుళ్లు ఆస్తికోసం గొడవకు దిగడంతో ముగ్గురు అన్నదమ్ములు ఆవేశంతో రగిలిపోయారు. గొడ్డళ్లతో సోదరి ఇంటిపైకి వెళ్లిన సోదరులు కుటుంబంపై విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. దీంతో ఆ కుటుంబం కూడా ఎదురుదాడికి దిగారు. ఇలా సోదరుల దాడిలో తీవ్రంగా గాయపడిన పూర్ణిమ బాయ్ (45) ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె భర్తతో పాటు కొడుకులు తీవ్ర గాయాలతో గురజాల హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 

ఈ ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. మృతురాలి కొడుకు వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇదిలావుంటే ఇదే పల్నాడు జిల్లాలో నిన్న (మంగళవారం) దారుణం చోటుచేసుకుంది. రొంపిచర్ల మండల టిడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై గుర్తుతెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. అలవల నుంచి చిట్టి పోతుల వారిపాలెం మార్గంలో ఉదయం పూట వాకింగ్ కు వెళుతున్న బాలకోటి రెడ్డిపై దుండగులు కత్తులు, గొడ్డళ్లతో దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో చికిత్స కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలకోటిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.

రొంపిచర్ల ఎంపీపీ భర్త గెడ్డం వెంకట్ రావుతో పాటు ఆయన అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో టిడిపి కార్యకర్తపై హత్యాయత్నం చేశారని.. అప్పుడు దాని మీద పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఈ క్రమంలోనే మరోసారి దాడి జరిగిందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే వైసిపి నాయకులు రెచ్చిపోతున్నారని... దీంతో టీడీపీ నేతలకు రక్షణ కరువైందని నారా లోకేష్, అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు.