వద్దని ఎన్నిసార్లు బెదిరించినా... తన చెల్లెలి వెంటపడుతున్నాడని.. ఓ యువకుడిపై దారుణంగా దాడిచేశారు. యువకుడిని పరుగులు పెట్టించి మరీ..బీరు సీసాలతో పొడిచారు.  అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై కూడా దాడి చేయబోయారు. ఈ సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రావికమతం గ్రామానికి చెందిన వేపాడ నరేంద్రకుమార్‌(17), కొత్తకోటలో లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కొంత కాలంగా ప్రేమించుకొంటున్న వీరు ఏడాది క్రితం ఊరు విడిచి వెళ్లిపోయారు. ఇంటికి తిరిగి వస్తే వివాహం చేస్తామని అమ్మాయి కుటుంబ సభ్యులు చెప్పడంతో తిరిగి వచ్చారు. అయితే ఇద్దరూ మైనర్లు కావడంతో రెండేళ్ల తరువాత పెళ్లి చేస్తామని, అప్పటి వరకు అమ్మాయిని కలవవద్దని యువతి తల్లిదండ్రులు సూచించారు.
 
తొలుత ఇందుకు సమ్మతించిన నరేంద్రకుమార్‌, తరువత యువతిని కలవడానికి వస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె సోదరులు, నరేంద్రకుమార్‌ని వారించారు. అయినా తీరు మారకపోవడంతో మంగళవారం రాత్రి ఒక రెస్టారెంట్‌ వద్ద ఉన్న నరేంద్రకుమార్‌పై యువతి సోదరులు ఘర్షణకు దిగి బీరుసీసాతో దాడి చేశారు. గాజు ముక్కలతో చేతులు, కాళ్లపై విచక్షణా రహితంగా పొడిచారు. 

అంతటితో ఆగకుండా కర్రలతో కూడా దాడి చేశారు. అక్కడ వున్న వారు ఇదేమిటని ప్రశ్నిస్తూ, నివారించబోయారు. వారిపైనా దాడికి దిగడంతో మిన్నకుండిపోయారు. దీంతో నరేంద్రకుమార్‌ వెంటపడ్డారు. అతను ప్రాణభయంతో పరుగులు తీశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన యువకుల్లో ఒకరిని పట్టుకోగా, మరొకరు పరారయ్యారు. గాయపడిన నరేంద్ర కుమార్‌ని చికిత్స నిమ్తితం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా కేసు నమోదు చేయలేదని, దర్యాప్తు చేస్తున్నామని ఏఎ్‌సఐ నాగేశ్వరరావు పేర్కొన్నారు.