విజయవాడ: తెలుగు తమ్ముళ్లు ఒక్కరొక్కరే రాజీనామా బాట పడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు నామినేటెడ్ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. 

తాజాగా బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ ఆనంద సూర్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మారినందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ మోహన్ రెడ్డికి  ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 

బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యే లుగా గెలుపొందిన కోన రఘుపతి, మల్లాది విష్టులకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. స్వాత్రంతం వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాహ్మణులకు ఎవరు చేయనంతటి సేవని చంద్రబాబు చేశారని ఆయన కొనియాడారు.

తాను బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఒక లక్ష 62 వేల మంది బ్రాహ్మణులకు ప్రయోజనం చేకూర్చినట్లు ఆయన తెలిపారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇతోధికంగా సేవ చేసే అవకాశం కలిపించిన చంద్రబాబు నాయుడికి  ఆయన కృతజ్ఢతలు తెలిపారు.