విజయవాడ నగరంలో దారుణం చోటుచేసుకుంది. నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మృతిచెందాడు. కాగా.. మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు కేవలం యూట్యూబ్ లో వీడియోలు చూసి...చికిత్స కోసం వెళ్లడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... విజయవాడ లోని గవర్నర్ పేటకు చెందిన భువనేశ్వరరావు అనే వైద్యుడు బుద్ధి మాంద్యానికి చికిత్స చేస్తానంటూ యూట్యూబ్ లో వీడియోలు షేర్ చేశాడు. ఆ వీడియోలను చూసిన చాలా మంది నిజమని నమ్మి... గవర్నర్ పేటలోని గంగోత్రి లాడ్జిలో ఉన్న ఆక్ష్న వద్దకు చికిత్సచేయించుకోవడానికి వచ్చారు.

భువనేశ్వరరావు... గంగ్రోతి లాడ్జిలోని మూడు గదులను అద్దెకు తీసుకొని  నాలుగు రోజులుగా చిన్నారులకు వైద్యం అందిస్తున్నాడు. కాగా... బెంగళూరు, బల్లారి, కడప, తెలంగాణ నుంచి వైద్యం చేయించుకోవడానికి మొత్తం 11 మంది రోగులు ఆయన వద్దకు వచ్చారు. వారికి భువనేశ్వరరావు తనకు తోచిన నాటు వైద్యం చేశాడు.

కాగా... అతను చేసిన నాటు వైద్యం వికటించి 10వ తరగతి చదివే హరనాథ్ అనే బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని  చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించారు. కాగా.. చిన్నారులకు నాటు వైద్యం చేసిన వైద్యుడు భువనేశ్వరరావు ని పోలీసులు అరెస్టు చేశారు.

కాగా...బాలుడు నిజంగా వైద్యం వికటించి చనిపోయాడా లేదా అన్న విషయం తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు చిన్నారులను విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

కాగా... దేశం శాస్త్రీయ పరంగా ముందుకు వెళ్తున్నా కూడా ఇంకా నాటు వైద్యాలను ప్రజలు ఎలా నమ్ముతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అది కూడా యూట్యూబ్ లో యాడ్స్ చేసి.. చిన్నారుల ప్రాణాల మీదకు ఎలా తీసుకువచ్చారంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి నాటు వైద్యాలు  చేస్తూ చిన్నారుల ప్రాణాలు తీస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.