అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూముల కుంభకోణం కేసులో చంద్రబాబు పేరు ఉంటుందని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. అమరావతి భూములు పేద ప్రజలవి అని తాము మొదటి నుంచి చెబుతున్నామని ఆయన అన్నారు. 

పేదలను, దళితులను మభ్య పెట్టి చంద్రబాబు భూములు దోచుకున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చట్టం తన పని తాను చేసుకునిపోతుందని ఆయన అన్నారు. అమరావతి భూముల కుంభకోణం కేసు ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు ఉంటుందని ఆయన అన్నారు. అమరావతిపై రెఫరెండం పెట్టే ప్రయత్నం చేసి చూడండని ఆయన అన్నారు. 

అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం రథం దగ్ధం ఘటనపై చంద్రబాబు చేస్తున్న విమర్శలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. అంతర్వేది ఘటనపై తాము సిబీఐ విచారణకు ఆదేశించామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోకి చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలోని సీబీఐ రాకుండా నిషేధించారని ఆయన అన్నారు.

గోదావరి పుష్కరాల్లో భక్తులు మరణిస్తే చంద్రబాబు ఏ విచారణకు ఆదేశించారని ఆయన అన్నారు. దేవుళ్లకు కూడా రాజకీయాలు అంటగడుతున్నారని ఆయన అన్నారు. సంఘటనలు జరిగిన వెంటనే విచారణకు ఆదేశిస్తున్నట్లు ఆయన తెలిపారు.