అమరావతి : ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. 

రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ వైఎస్ జగన్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరతామని తెలిపారు. తెలుగుదేశం పార్టీలా అదిగో ఇదిగో అంటూ కల్లబొల్లిమాటలు చెప్పమని జగన్ సారథ్యంలో టైం పిరియడ్ లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. 

పోలవరం ప్రాజెక్టును పూర్తి చెయ్యాలన్నది ఆనాటి సీఎం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల అని ఆ కలను ఆయన తనయుడు ప్రభుత్వం నెరవేర్చబోతుందన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా, ఎలాంటి పగులు లేకుండా నాణ్యంగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. 

పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు కాలయాపన చేశారని విమర్శించారు. ఈ ఐదేళ్లు సమయాన్ని వృద్ధా చేశారంటూ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ కోసం ప్రత్యేక హోదాన్ని తాకట్టుపెట్టారంటూ ఆరోపించారు. కాసులకు కక్కుర్తిపడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని తెలిపారు. 

చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై ఇకనైనా జిమ్మిక్కులు ఆపాలని కోరారు. చంద్రబాబు మీ వయసును, అనుభవాన్ని ప్రజలకు మంచి చేసేందుకు ఉపయోగించాలని అంతేకాని ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించకండంటూ హితవు పలికారు. గత ఐదేళ్లుగా పోలవరం ప్రాజెక్టుపై అబద్దాలు చెప్పారని ఇక ఆ అబద్దాలు కట్టిపెట్టాలని బొత్స సత్యనారాయణ హితవు పలికారు.