Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరాంధ్ర పొలిటికల్ స్క్రీన్ పై బొత్స మార్క్ రాజకీయం

అలాగే జిల్లాలో మరోకరికి మంత్రి వర్గంలో చోటు దక్కనివ్వకుండా విప్ పదవితో సరిపెట్టేలా వ్యూహం రచించారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఏది ఏమైనప్పటికీ బొత్స సత్యనారాయణ మళ్లీ పొలిటికల్ స్క్రీన్ పై తనమార్క్ పాలిటిక్స్ కు పదును పెడుతున్నారని ఉత్తరాంధ్రలో ప్రచారం జరుగుతోంది. 

botcha satyanarayana mark politics in uttarandhra
Author
Amaravathi, First Published Jun 8, 2019, 9:55 PM IST

 
అమరావతి: ఉత్తరాంధ్రలో మళ్లీ బొత్స సత్యనారాయణ హవా మెుదలైందా...? ఒకప్పుడు ఉత్తరాంధ్రను ఒంటి చేత్తో ఏలిన బొత్స మళ్లీ పూర్వవైభవానికి చేరుకున్నారా...? ఆనాడు వైయస్ హయాంలో ఉత్తరాంధ్రకు పెద్దదిక్కుగా ఉన్న బొత్స జగన్ హయాంలో కూడా ఓ వెలుగు వెలబోతున్నారా...? 

ఉత్తరాంధ్రలో బొత్స మార్క్ రాజకీయం ఏపీ కేబినెట్ కూర్పులో కనిపించిందా...? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ అంటే తెలియనివారు ఉండరు. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా, పీసీసీ చీఫ్ గా ఒకానొక దశలో ముఖ్యమంత్రి పదవికి సైతం పోటీపడ్డ నాయకుడు. 

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన పాలనలో తన మార్క్ చూపించుకుంటూ వచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోవడంతో ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి తన వ్యూహాలతో కీలక నేతగా మారిపోయారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా గుర్తింపు పొందారు. అంతేకాదు ఉత్తరాంధ్ర జిల్లాలు, ముఖ్యంగా విజయనగరం జిల్లా  గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నారు బొత్స సత్యనారాయణ. 

ఎలాగైనా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న కసితో రగిలిపోయిన బొత్స తనదైన వ్యూహాలతో విజయనగరం జిల్లాలో క్లీన్ స్వీప్ చేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో అత్యధిక స్థానాలు గెలుపొందడంలో కూడా కీలక పాత్ర పోషించారు. 

వైయస్ జగన్ ఊహించినదానికంటే ఉత్తరాంధ్రలో అత్యధిక సీట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో పార్టీలో బొత్స సత్యనారాయణకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఉత్తరాంధ్ర బాధ్యతలను వైయస్ జగన్ బొత్స కే అప్పగించారు. 

దీంతో బొత్స సత్యనారాయణ మంత్రి వర్గ కూర్పులో తన మార్క్ ను ప్రదర్శించారంటూ ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రలో మళ్లీ పూర్వవైభవం రావాలంటే తనకంటూ ఎదురులేకుండా చేయాలని అనుకున్నారు. తనకు అనుకూలంగా ఉన్నవారికే పదవులను కట్టబెట్టేలా చక్రం తిప్పారు బొత్స. 

శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కృష్ణదాస్ ను మంత్రి వర్గంలో తీసుకోవడం వెనుక బొత్స ప్లాన్ ఉందని ప్రచారం జరుగుతోంది. ధర్మాన ప్రసాదరావు అయితే ఉత్తరాంధ్రలో తన ఆధిపత్యానికి గండికొట్టే ఛాన్స్ ఉందని భావించిన బొత్స ధర్మాన కృష్ణదాస్ ను మంత్రి వర్గంలో తీసుకునే దానికే మెుగ్గు చూపారని సమాచారం. 

ఇకపోతే శ్రీకాకుళం వైసీపీలో మరో ధీటైన నేత తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసిన ఆయన మంచి వాగ్ధాటి. సమయాన్ని బట్టి వ్యూహాలు రచించడంలో దిట్ట. ధర్మాన ప్రసాదరావు కంటే రాజకీయాల్లో సీనియర్ అయిన సీతారాం రాజకీయ చాణుక్యుడుగా గుర్తింపు పొందారు. 

ఆయన చివరి నిమిషం వరకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయితే అనూహ్య రీతిలో ఆయనను స్పీకర్ కుర్చీపై కూర్చోబెట్టారు వైయస్ జగన్. దీని వెనుక బొత్స మంత్రాంగం కూడా ఉందంటూ ప్రచారం జరుగుతోంది. 

ఇకపోతే తన సొంత జిల్లా అయిన విజయనగరంలో కూడా తనకు ఎదురులేకుండా చూసుకున్నారు. తనతో తొలి నుంచి సఖ్యతగా ఉంటూ ఇటీవలే కాస్త ఎడమెహం పెడమెహంగా ఉంటున్న ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు గట్టి షాక్ ఇచ్చారు బొత్స. 

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజన్నదొరకు జగన్ కేబినెట్ లో స్థానం దక్కపోవడం వెనుక బొత్స ప్లాన్ ఉందని విజయనగరం జిల్లాలో ప్రచారం జరుగుతోంది. శుక్రవారం ఉదయం అంతా రాజన్నదొర డిప్యూటీ సీఎం అంటూ ప్రచారం జరిగింది. అయితే సాయంత్రానికి సీన్ కాస్త రివర్స్ అయ్యింది. 

నాలుగుసార్లు గెలిచిన రాజన్నదొరను కాదని రెండోసారి గెలిచిన కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి కేబినెట్ లో స్థానం దక్కింది. అంతేకాదు ఆమె డిప్యూటీ సీఎం పదవి కూడా దక్కించుకున్నారు. ఈ తతంగం అంతా తెరవెనుక నడిపించింది బొత్స సత్యనారాయణేనని ప్రచారం జరుగుతోంది. 

అంతేకాదు ఉత్తరాంధ్రలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు వెన్నుముకగా నిలిచిన కోలగట్ల వీరభద్రస్వామికి కూడా మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. కోలగట్ల వీరభద్రస్వామికి మంత్రి వర్గంలో స్థానం దక్కితే ఇప్పటికే విజయనగరంలో రెండు గ్రూపులుగా ఉన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక మరింత ముదురుపాకాన పడుతుందని బొత్స భావించారు. 

కోలగట్ల వీరభద్రస్వామి తన ఆధిపత్యానికి గండికొట్టే ప్రమాదం ఉందని గ్రహించిన బొత్స మంత్రి పదవి దక్కుండా చక్రం తిప్పారు. ఇకపోతే విశాఖపట్నం జిల్లాలో తనకు సన్నిహితుడు అయిన అవంతి శ్రీనివాస్ కు మంత్రి వర్గంలో స్థానం దక్కడంలో చక్రం తిప్పారు బొత్స సత్యనారాయణ. 

అలాగే జిల్లాలో మరోకరికి మంత్రి వర్గంలో చోటు దక్కనివ్వకుండా విప్ పదవితో సరిపెట్టేలా వ్యూహం రచించారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఏది ఏమైనప్పటికీ బొత్స సత్యనారాయణ మళ్లీ పొలిటికల్ స్క్రీన్ పై తనమార్క్ పాలిటిక్స్ కు పదును పెడుతున్నారని ఉత్తరాంధ్రలో ప్రచారం జరుగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios