గన్నవరం విమానాశ్రయంతో పాటు నెల్లూరు రైల్వేస్టేషన్ లో బాంబ్ పెట్టినట్లు ఆగంతకులు ఫోన్ చేసి భయబ్రాంతులకు గురిచేసారు.
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. గన్నవరం విమానాశ్రయంతో పాటు నెల్లూరు రైల్వే స్టేషన్ లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు కాల్స్ రావడంతో ప్రయాణికులు భయంతో పరుగుతీసారు. అప్రమత్తమైన అధికారులు పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. ప్రయాణికులను బయటకు పంపించి విమానాశ్రయం, రైల్వే స్టేషన్ మొత్తం తనిఖీలు చేపట్టినా ఎక్కడా బాంబ్ దొరకలేదు. దీంతో బాంబ్ బెదిరింపు కాల్ ఆకతాయిల పనిగా తేల్చారు.
గన్నవరం విమానాశ్రయంలో గత రాత్రి దేశ రాజధాని డిల్లీకి వెళ్ళడానికి ప్రయాణికులు రెడీగా వున్నారు... ఎయిరిండియా విమానం కూడా సిద్దంగా వుంది. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఎవరో విమానాశ్రయ అధికారులకు ఫోన్ చేసాడు. విమానాశ్రయంలో బాంబ్ పెట్టినట్లు... మరికొద్దిసేపట్లో అది పేలనున్నట్లు బెదిరించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రయాణికుల విమానాశ్రయంలోకి అనుమతి నిలిపివేసారు. అప్పటికే లోపలికి వచ్చినవారిని కూడా బయటకు పంపించారు. డిల్లీకి వెళ్లడానికి సిద్దంగా వున్న ఎయిరిండియా విమానాన్ని కూడా నిలిపివేసారు.
Read More పిడుగుపాటుతో జేబులోని సెల్ ఫోన్ పేలి వ్యక్తి మృతి...
విమానాశ్రయ భద్రతా సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ విమానాశ్రయంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయినా ఎక్కడా బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాంబ్ బెదిరింపు ఆకతాయిల పనిగా తేల్చారు. కాల్ చేసిన ఆగంతకుడిని గుర్తించేందుకు గన్నవరం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాంబ్ బెదింపులు, తనిఖీల కారణంగా డిల్లీకి వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
వీడియో
ఇదిలావుంటే నెల్లూరు రైల్వే స్టేషన్ లో కూడా బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై బాంబు పెట్టినట్లు... కొద్దిసేపట్లో అది పేలి మారణహోమం సృష్టిస్తుందంటూ 112 నంబర్ (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ERSS)) కు గుర్తు తెలియని దుండుగు ఫోన్ చేసాడు. దీంతో సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు వెంటనే నెల్లూరు రైల్వే స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేసారు. ప్రయాణికులను బయటకు పంపించి పార్సిల్స్, ప్లాట్ ఫారం, నిలిపివున్న ట్రైన్స్ ఇలా ఏదీ వదలకుండా రైల్వే భద్రతా సిబ్బంది, బాండ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. కానీ ఎక్కడా బాంబు లేకపోవడంతో బెదిరింపు కాల్ ఆకతాయిల పనిగా తేల్చారు.
ఇలా ఒకేసారి విమానాశ్రయం, రైల్వే స్టేషన్ కు బాంబు బెదింరింపు కాల్స్ రావడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ గందరగోళం సృష్టించిన ఆకతాయిల కోసం గాలింపు చేపట్టారు. మరోసారి ఇలాంటి పనులు చేయకుండా కఠినంగా శిక్షించాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.
