పశ్చిమగోదావరి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను హత్యచేసి, మృతదేహాన్ని రెండు భాగాలుగా చేసి పోలవరం కాలువ సమీపంలో పడేశారు. ఆ శరీర భాగాలు దొరకడంతో కలకలం చెలరేగింది.   

పశ్చిమగోదావరి : దేవరపల్లి మండలంలోని పోలవరం కాలువలో బుధవారం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని రెండు భాగాలుగా గుర్తించగా, వాటితో పాటు కత్తి, కత్తెర కూడా లభ్యమయ్యాయి. డీఎస్పీ శ్రీనాథ్, ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. యర్నగూడెం-చిన్నాయిగూడెం ప్రధాన రహదారిలో పోలవరం కుడి కాలువ వద్ద దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఆ మేరకు వారు వచ్చి పరిశీలించి యర్నగూడెం-చిన్నాయిగూడెం కాలువ కింద తల నుంచి పొట్ట వరకు భాగాన్ని గుర్తించారు. మరో భాగాన్ని యర్నగూడెం నుంచి ఓ పామాయిల్ కర్మాగారం రోడ్డులోని పోలవరం కుడి కాలువ కింద ఓ లగేజ్ సంచిలో కనుగొన్నారు. మృతదేహంతో పాటు కత్తి, కత్తెర లభించగా.. హత్య చేసేందుకు వాటిని ఉపయోగించినట్లు పోలీసులు భావిస్తున్నారు. సుమారు 40 నుంచి 45 ఏళ్లున్న వివాహిత అని చెబుతున్నారు. క్లూస్ టీం, డాగ్ టీంతో ఆ పరిసరాల్లో పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. 

భోగాపురం ఎయిర్‌పోర్టు, ట్రైబర్ యూనివర్సిటీలకు నవంబర్ 11న ప్రధాని మోదీ శంకుస్థాపన..?

ఇదిలా ఉండగా, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సంచలనం సృష్టించిన ఆటోడ్రైవర్ కరీముల్లా హత్య కేసులో సూత్రధారి అతడి భార్య అని తేలింది. ఈ నెల 8న మృతదేహం గోనెసంచిలో లింగందిన్నె రహదారిలో విద్యుత్ ఉపకేంద్రం వద్ద బయటపడింది. భార్య మాబ్బి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. మొదట అనుమానితులను విచారించినా.. ఎవరో తేలలేదు. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు.. ఆమె ఫోన్లోని వివరాల ఆధారంగా కూపీ లాగారు. ఆమె ఎక్కువగా కడప జిల్లా పెద్దముడియం మండలం జె. కొత్తపల్లి గ్రామానికి చెందిన వంశీ కుమార్ రెడ్డితో మాట్లాడినట్లు తేలింది.

భార్యను విచారించగా అసలు విషయం బయటపడింది. వంశీ కుమార్ రెడ్డి ఫేస్బుక్లో పరిచయం అయ్యాడని, ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు పోలీసులు గుర్తించారు. భర్తను హత్య చేస్తే అడ్డు ఉండదని భావించి.. ఇద్దరూ కలిసి ఈ నెల 1న రాత్రి మద్యం మత్తులో ఇంట్లో పడుకుని ఉన్న కరీముల్లా మెడకు తీగను బిగించి హత్య చేశారు. మరుసటి రోజు ఇద్దరు కలిసి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లి పొదల్లో పారేశారు. 

నిందితురాలు మాబ్బికి ముగ్గురు పిల్లలు, వయసు 33 ఏళ్లు, వంశీ కుమార్ రెడ్డి వయసు 22 ఏళ్లు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. హత్యకు ముందు రోజు అహోబిలం వెళ్లి ఎలా హత్య చేయాలని, తర్వాత ఎలా ఉండాలి అన్న విషయాలపై ప్రణాళిక వేసుకున్నట్లు విచారణలో తేలింది. విచారణను తప్పుదోవ పట్టించేందుకు మాబ్బి.. భర్త మృతదేహంపై పడి రోధించింది. ఇతరులపై అనుమానాలు ఉన్నట్లు చెప్పింది. ఆమె మాటల్లో పొంతన లేకపోవడంతో విచారణ చేపట్టారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. ఈ సమావేశంలో సీఐ జీవన్ బాబు, ఎస్సై తిమ్మయ్య పాల్గొన్నారు.