ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రధాన పార్టీగా కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఆ పార్టీనే. వచ్చే ఎన్నికల్లో సైతం ఆ పార్టీనే గెలుస్తుందని చాలా వరు భావిస్తున్నారు. కాగా.. అలాంటి పార్టీపై ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ మూసేసే పార్టీ అని ఆయన అన్నారు. మూడు సంవత్సరాల తర్వాత అసలు వైసీపీ ఉండదని చెప్పారు. తాను గ్యారెంటీగా చెబుతున్నానని.. కావాలంటే రాసిపెట్టుకోండి అంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. మూసేయడం అంటే ఆ పార్టీ అధికారంలో ఉండదని అర్థం అంటూ విష్ణుకుమార్ వ్యాఖ్యానించారు.

 తెలుగు దేశం పార్టీ ఓడిపోతుందని తాను ముందే చెప్పానని, అదే జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నోటికి వచ్చింది చెప్పడానికి తాను కేఏ పాల్‌ను కానని విష్ణుకుమార్ సెటైర్ వేశారు. జగన్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని చెప్పారు. ప్రజలకు జగన్ ముద్దులు పెడితే నిజమైన ప్రేమ అనుకున్నారని, కానీ ఇప్పుడు వారికి అది కపట ప్రేమ అని తెలిసిందన్నారు. 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే లోపల వేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖలో అక్రమ కట్టడాలంటూ శుక్రవారం రాత్రి నుంచే కూలగొడుతున్నారని చెప్పారు. కోర్టులు శని, ఆదివారాలు కూడా తెరిచే విధంగా చూడాలని కోరారు. విశాఖలో బెంచ్ ఏర్పాటు చేయాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని, లేకపోతే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉందని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.