గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పుట్టినరోజున(సోమవారం) 'వైయస్సార్ జగనన్న భూహక్కు-భూ రక్ష' పేరిట భూముల రీసర్వేను ప్రారంభించిన విషయం తెలిసిందే.  అయితే కేంద్ర ప్రభుత్వ పథకం 'స్వామిత్వ'  పేరుమార్చి తన పథకంగా సీఎం జగన్ ప్రచారం చేసుకుంటున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  యస్.విష్ణువర్ధన్ రెడ్డి
 ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికన సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు.

''పుట్టినరోజే అబద్దాలా? ప్రజల స్థలాల రక్షణ, భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం పథకం’స్వామిత్వ’ప్రవేశపెడితే వైఎస్ జగన్ గారు మీ ప్రభుత్వం పేరుమార్చి ‘వైయస్సార్ జగనన్న భూహక్కు-భూ రక్ష ‘ప్రారంభోత్సవం చేయడం ఏంటి?పేర్లు మార్చి ప్రజలను ఎన్నాళ్ళు ఏమార్చగలరు. కనీసం ప్రధాని పోటో పెట్టరా?'' అంటూ ట్విట్టర్ వేదికన ప్రశ్నించారు.

''సీఎం జగన్ గారు కాంగ్రెస్ పార్టీని వీడినా ఆ పార్టీ సాంప్రదాయాన్ని మాత్రం విడిచినట్లు లేరు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను తన సొంత పేరు పెట్టుకుని ప్రచారం చేసుకోవడాన్ని ఖండిస్తున్నా. ఈ విషయంలో ప్రధాని మోదీని చూసి జగన్ చాలా నేర్చుకోవాలి. గత ఆరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వేల సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపట్టిన ఏ ఒక్కదానికి ప్రధాని తన పేరు పెట్టుకోలేదు'' అని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.