విజయనగరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సవాల్ విసిరారు. తండ్రీ కొడుకుల అవినీతిని తాను బయటపెడతానని దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. 

విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ తెలంగాణలో ఏర్పడినది ప్రజాకూటమి కాదని పెద్ద దొంగల కూటమి అంటూ ధ్వజమెత్తారు. 

ప్రజాకూటమి ఎన్ని కుట్రలు చేసినా ప్రధాని మోడీనే ప్రజలు స్వాగతిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ల అవినీతిని బయటపెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. నిరూపించకపోతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని సవాల్ విసిరారు. 

తండ్రీ, కొడుకులు నీతిమంతులైతే సీబీఐని ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. లోకేష్, చంద్రబాబులకు ధైర్యం ఉంటే సీబీఐ ఎంక్వైరీ వేయించుకుని నిజాయితీ నిరూపించుకోవాలని కన్నా హితవు పలికారు.