గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఏపీ బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు చేస్తోందని ఆరోపించారు. 

గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి అరాచకాలకే పాల్పడిందని ఇప్పుడు వైసీపీ కూడా అదేబాటలో పయనిస్తోందని మండిపడ్డారు. పద్దతి మార్చుకోకపోతే టీడీపీకి పట్టిన గతే పడుతోందని కన్నా హెచ్చరించారు.  

గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో బీజేపీ జెండా దిమ్మలను వైసీపీ నేతలు కూల్చివేస్తున్నారని తెలిసిందని అది సరికాదన్నారు. తమ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోబోమని వైసీపీని హెచ్చరించారు. 

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతేకానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు, దాడులు చేస్తే సహించేది లేదన్నారు. గతంలో టీడీపీ చేసిన అరాచకాలను సహించలేకే ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారని తెలిపారు. 

ఇకనైనా వైసీపీ నేతలు పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. అధికారంతో మంచి పనులు చేసి ప్రజల అభిమానం సంపాదించుకోవాలన్నారు. అంతేకానీ కక్ష సాధింపులు ఉండకూడదని అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు.