Asianet News TeluguAsianet News Telugu

ఆర్ఆర్ఆర్‌కు నో టికెట్.. జగన్ కనుసన్నల్లో బీజేపీ టికెట్ల కేటాయింపు?

ఆర్ఆర్ఆర్‌కు షాక్ తగిలింది. నర్సాపురం నుంచి ఎంపీ టికెట్‌ను బీజేపీ ఆయనకు ఇవ్వలేదు. ఈ పరిణామంపై రఘురామ స్పందించారు.
 

bjp no ticket for raghurama krishnamraju, his reaction of not getting narsapuram seat kms
Author
First Published Mar 25, 2024, 3:01 AM IST

నర్సాపురం ఎంపీ, వైసీపీ, సీఎం జగన్ పై తిరుగుబాటు చేసిన రఘురామ కృష్ణంరాజుకు భంగపాటు ఎదురైంది. గతంలో వైసీపీ నుంచి గెలిచి లోక్ సభలో అడుగుపెట్టిన రఘురాము.. ఆ తర్వాత వైసీపీకి రెబల్‌గా మారారు. జగన్ పై తరుచూ విమర్శలు చేశారు. ఈ సారికి ప్రతిపక్ష శిబిరం నుంచి లోక్ సభకు పోటీ చేయాలని అనుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు విషయంలో కూడా రఘురామ పేరు చర్చకు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. నర్సాపురం సీటు బీజేపీకి వెళ్లినా.. అక్కడ నుంచి పోటీకి రఘురామ కృష్ణంరాజుకే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు అడిగినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. కానీ, ఈ రోజు బీజేపీ విడుదల చేసిన జాబితాలో ఆర్ఆర్ఆర్‌ పేరు లేదు. నర్సాపురం నుంచి మరో నాయకుడికి అవకాశం ఇచ్చారు.

తనకు టికెట్ దక్కలేదని తెలిసిన తర్వాత రఘురామ ఓ వీడియో రికార్డ్ చేసి మీడియాకు అందించారు. తనకు టికెట్ దక్కకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా తన ఓటమిని అంగీకరిస్తున్నట్టు చెప్పారు. కానీ, జగన్‌కు ఓటమి తప్పదని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుస్తుందని వివరించారు.

తనకు టికెట్ రాకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యాడనీ ఆర్ఆర్ఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజుతో జగన్‌కు సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన ద్వారానే తనకు టికెట్ రాకుండా చేశారని తనకు తెలిసిందని అన్నారు. దీంతో బీజేపీ టికెట్ల కేటాయింపు జగన్ కనుసన్నల్లోనే జరిగిందా? అనే అనుమానాలు వస్తున్నాయి.

ఈ అనుమానాలే ప్రబలమైతే.. అది విపక్ష కూటమికే దెబ్బగా మారే అవకాశం లేకపోలేదు. బీజేపీ జగన్‌తోనూ సుముఖంగా ఉన్నదనే ప్రచారం జరిగితే.. వైసీపీపై తీవ్రంగా పోరాడుతున్న టీడీపీ, జనసేనలు కమలం పార్టీతో పొత్తు పెట్టుకుని ఆశిస్తున్న లక్ష్యాలు నీరుగారిపోవచ్చనే విశ్లేషణలు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios