రాయలసీమలో రెండవ రాజధాని ఏర్పాటు చేసి, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించడం ద్వారానే అమరజీవి పొట్టి శ్రీరాములు కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్.

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఆదివారం కర్నూలులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తెలుగు వారంతా ఒక్కటిగా ఉండాలన్న ఉద్దేశంతో 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్ర అవతరణకు అమరజీవి పాటుపడ్డారని గుర్తుచేశారు.

గ్రేటర్ రాయలసీమలోని నెల్లూరు జిల్లాకు చెందిన పొట్టి శ్రీరాములు తెలుగు వారితో పాటు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని వెంకటేశ్ కొనియాడారు. అమరజీవి ప్రాణత్యాగ ఫలితంగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పడిందని, కానీ మూడేళ్లకే అది తెలంగాణకు తరలిపోయిందని ఆయన చెప్పారు.

రాష్ట్ర విభజన అనంతరం తిరిగి రాజధాని అమరావతికి తరలిపోయిందని , మళ్ళీ ఇప్పుడు  విశాఖపట్నం అంటున్నారని వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో అమరజీవి కలలు ఏ మాత్రం నెరవెరాలన్నా రాయలసీమలో రెండవ రాజధానిని ఏర్పాటు చేసి, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని టీజీ వెంకటేశ్ ప్రభుత్వాన్ని కోరారు.