కర్నూలు: ప్రాంతీయ పార్టీలో ఉన్నప్పుడు గొంతును వినిపించలేకపోయానంటూ బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాయలసీమ కోసం పోరాడిన వ్యక్తి దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. 

వైయస్ఆర్ ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉందని స్పష్టం చేశారు. సీఎం జగన్ రాయలసీమ అభివృద్ధికి సహకరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు తనను విమర్శిస్తే సహిస్తాను కానీ ప్రాజెక్టులను ఆపితే మాత్రం ఊరుకోనని హెచ్చరించారు. 

బీజేపీ నాయకత్వంతో మాట్లాడి సీమహక్కుల కోసం ప్రశాంతంగా పోరాటం చేస్తానని టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. బీజేపీ రాయలసీమ అభివృద్ధికి డిక్లరేషన్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. రాయలసీమ ప్రయోజనాల కోసమే ఐక్యవేదికను ఏర్పాటు చేసినట్లు టీజీ వెంకటేశ్ గుర్తు చేశారు. 

కళ్లముందు నీరున్నా తాగలేని పరిస్థితుల్లో రాయలసీమ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఒకస్టోరేజ్ ట్యాంక్ లాగే మిగిలిపోతుందన్నారు. రాయలసీమ బాగు కోసం ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. లేకపోతే రాయలసమీకు పరిశ్రమలు రావడం కష్టమేనని స్పష్టం చేశారు. 

రాయలసీమ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. రాయలసీమ హక్కుల కోసం తాను పోరాటం చేస్తానని అంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ అభివృద్ధికి పోరాడే వారికి మద్దతు ఇస్తామని ఎంపీ టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. 

ఇకపోతే శుక్రవారం సీఎం జగన్ 100 రోజుల పాలనపై ప్రశంసలతో ముంచెత్తిన ఎంపీ టీజీ వెంకటేష్ 24 గంటలు గడవక ముందే జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

షాక్... జగన్ పై ఎంపీ టీజీ వెంకటేష్ ప్రశంసల వర్షం