టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నివాసానికి ఆదివారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వచ్చారు. టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు కూడా అక్కడే వున్నారు.
గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నివాసానికి ఆదివారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వచ్చారు. ఆ కాసేపటికీ టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు కూడా రావడంతో ఈ వ్యవహారం జిల్లాలో రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ సందర్భంగా వీరు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
అనంతరం సుజనా మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి చేయడం దారుణమన్నారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే వున్నాయని సుజనా చౌదరి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని తరిమిస్తేనే ఏపీకి మంచి రోజులు వస్తాయని ఆయన అన్నారు. ఆలపాటి రాజా మాట్లాడుతూ.. ఏపీ పరిస్ధితి ప్రస్తుతం అత్యంత దారుణంగా వున్నారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతుందేమోనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిస్ధితిపై ప్రజాస్వామ్యవాదులు , విపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం వుందన్నారు.
