విజయవాడ: టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్ ఆంధ్రా విజయ్ మాల్యా అయ్యారని ఆరోపించారు. హాయ్ ల్యాండ్ ను కొట్టేయ్యాలని చూశారని విమర్శించారు. బీజేపీ పోరాటం వల్లే అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలన్న ఆలోచన నుంచి ప్రభుత్వ పెద్దలు వెనక్కి తగ్గారని చెప్పారు. 

హాయ్‌ల్యాండ్‌పై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు గిలగిల కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వ్యాపారులు, దొంగ నాయకులపై ఐటీ దాడులు చేస్తే ముఖ్యమంత్రికి ఎందుకంత భయమని వ్యాఖ్యానించారు.
 
చంద్రబాబు కోతల రాయుడు, అబద్ధాల రాయుడిగా మిగిలిపోతారన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని అప్పులు, ఆర్భాటాలేనని జీవీఎల్ పేర్కొన్నారు. 

ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే అన్ని పార్టీలు ఖండించడం సహజమేనని జీవీఎల్ అన్నారు. జగన్‌పై దాడి కేసును చంద్రన్న బ్యూరో ఇన్వెస్టిగేషన్‌తోనే విచారణ చేయిస్తామంటున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఒక మంత్రేమో మేం చేస్తే ఈ స్థాయిలో చేయం అంటున్నారని జీవీఎల్ గుర్తుచేశారు.