Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుతో పొత్తు నష్టమే, టీడీపీని విలీనం చేస్తానంటే అధిష్టానాన్ని ఒప్పిస్తా: బీజేపీ ఎంపీ జీవీఎల్

టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని ఇప్పుడు ఆ పార్టీ లోక్‌సభ సభ్యులు బీజేపీకి అవసరం లేదన్నారు. భవిష్యత్‌ గురించి భయపడే చంద్రబాబు కేంద్రంతో విభేదించమని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

bjp mp gvl narasimharao sensational comments on chandrababu naidu
Author
Vijayawada, First Published Oct 19, 2019, 2:46 PM IST

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీనీ బీజేపీలో విలీనం చేస్తానంటే తాను మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పుకొచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు అనేది ఊహాజనిత సమాచారం అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఏముందని పొత్తు పెట్టుకోవాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరి, రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారని చెప్పుకొచ్చారు. 

ఏపీలో శరవేగంగా బలోపేతం అవుతున్న పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు ఓడిపోయిన తెలుగుదేశం పార్టీతో తమకు పొత్తేంటంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు బీజేపీలో టీడీపీని విలీనం చేసే ఉద్దేశం ఉంటే మాత్రం తానే కీ రోల్ ప్లే చేస్తానని అధిష్టానంతో మాట్లాడతానన్నారు.  

రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి టీడీపీ అధినేత చంద్రబాబు గురించి అమిత్ షా తో ఎందుకు మాట్లాడుతున్నారో తనకు తెలియదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని చాలా నీచంగా చంద్రబాబు తిట్టారని గుర్తు చేశాు. 

దేశంలో ఏ నాయకుడు తిట్టని విధంగా చంద్రబాబు నాయుడు తిట్టారని చెప్పుకొచ్చారు. ధర్మపోరాట దీక్షలు పెట్టి తిట్టించారని గుర్తు చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో సైతం బహిరంగ సభ పెట్టించి మరీ బీజేపీపైనా, మోదీ, అమిత్ షాలపైనా ఎలా తిట్టించారో తమకు గుర్తున్నాయన్నారు. 

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేనేలేదన్నారు. ఓడిపోయిన పార్టీ నుంచి పది మంది నాయకులు వస్తే తమ పార్టీ బలపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.  కొందరు రాజకీయ భవిష్యత్‌ కోసం బీజేపీలో చేరుతున్నారని అలాంటి వారి వల్ల పార్టీ బలపడదన్నారు.  

తెలుగుదేశం పార్టీ అంటే విశ్వసనీయత, సిద్దాంతం లేని పార్టీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబు దగ్గర ఏముందని ఆయనతో కలిసి ముందుకు వెళతామని నిలదీశారు.  

టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని ఇప్పుడు ఆ పార్టీ లోక్‌సభ సభ్యులు బీజేపీకి అవసరం లేదన్నారు. భవిష్యత్‌ గురించి భయపడే చంద్రబాబు కేంద్రంతో విభేదించమని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కులాలు, మతాలతో రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూశారని మండిపడ్డారు. 

బీజేపీతో విభేదించి తప్పు చేశానని చంద్రబాబు నాయుడు చెప్తున్న వ్యాఖ్యలు వెనుక చాలా కారణాలు ఉండిఉండొచ్చన్నారు. చంద్రబాబు బీజేపీపై చేస్తున్న ఆరోపణలను తాము ఖండించామని తప్పు చేస్తున్నారని చెప్పుకొచ్చామని గుర్తు చేశారు. 

భవిష్యత్ గురించి భయపడే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మాటమారుస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసింది బీజేపీయేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయడు ఏనాడు స్వతహాగా ముఖ్యమంత్రి కాలేదన్నారు. తాము సపోర్ట్ చేస్తేనే ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కారని చెప్పుకొచ్చారు.  

చంద్రబాబును తాము భయపెట్టడం లేదని చెప్పుకొచ్చారు. అవినీతి ఎవరు చేసిన శిక్ష తప్పదు అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మోదీ మాటలకు భుజాలు తడుముకొంటే తాము ఏమి చేయలేమని చెప్పుకొచ్చారు. 

పోలవరంలో అవినీతి జరగలేదని మా పార్టీ నేతలు ఎవరూ చెప్పలేదని చెప్పుకొచ్చారు. పోలవరంలో దాదాపు రూ. 2200 కోట్ల మేర అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ నిర్ధారించిన విషయాన్ని ప్రస్తావించారు జీవీఎల్ నరసింహారావు. దానిపై రివర్స్ టెండరింగ్ వెళ్లామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోందన్నారు. 

పోలవరం, అమరావతిలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని సూచించారు జీవీఎల్ నరసింహారావు. ప్రజధనం దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు. 

అప్పు తీసుకోవడం తప్పుకాదు, దాన్ని ఎన్నికల్లో గెలవడం కోసం దుర్వినియోగం చేయడం చేయడం తప్పు అని చెప్పుకొచ్చారు. అప్పు చేసిన చంద్రబాబు పసుపు కుంకుమ కింద ప్రజా ధనాన్ని ఖర్చు చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా సుజనాచౌదరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జీవీఎల్ నరసింహారావు. రుణాలు ఎగవేత విషయంలో ఎవరు తప్పించుకోలేరన్నారు. అందుకు సుజనాచౌదరి కూడా అతీతుడు కాదన్నారు. అందరిలాగే సుజనాచౌదరి కూడా బ్యాంక్‌లకు రుణాలు కట్టాల్సిందేనని చెప్పుకొచ్చారు. సుజనా బీజేపీలో చేరినంత మత్రాన ఎలాంటి మినహాయింపులు ఉంటాయనుకోవడం సరికాదన్నారు. 

గతంలో చంద్రబాబు పోలవరంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు లెక్కలు అడిగాము. వాటికి చంద్రబాబు లెక్కలు చెప్పలేదు. ఖర్చు చేసిన నిధులకు చంద్రబాబు లెక్కలు ఎందుకు చెప్పలేక పోతున్నారో అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు జీవీఎల్ నరసింహారావు. 

Follow Us:
Download App:
  • android
  • ios