పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంపై స్పందించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఆయన స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 11, 2020న టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ ఇందుకు వివరణ ఇచ్చిందని జీవీఎల్ గుర్తుచేశారు. అది మన వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం గమనించిన విషయమని, తామే మొదటి నుంచి అమరావతి రాజధానిగా కొనసాగాలని తీర్మానంగా చేశామన్నారు.

గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతిని ఏకగ్రీవంగా ఆమోదించాయని నరసింహారావు తెలిపారు. కానీ తమ మేనిఫోస్టోలో రాయలసీమలో హైకోర్టు పెట్టాలని డిమాండ్ చేశామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అదే ప్రతిపాదనతో కేంద్రాన్ని సంప్రదించిన పక్షంలో తాము వ్యతిరేకించమన్నారు. కానీ రాష్ట్ర రాజధానిగా అమరావతే కొనసాగాలని, ప్రభుత్వ పెట్టుబడులు వృథా కాకూడదని తమ ఆకాంక్షని జీవీఎల్ చెప్పారు.

అమరావతిలో తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఆయన ఆరోపించారు. రైతులకు తప్పనిసరిగా న్యాయం జరగాలని.. అమరావతే రాజధానిగా కొనసాగి వుంటే బాగుండేదని జీవీఎల్ అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా.. అమరావతిని కేవలం శాసన రాజధానిగా పరిమితం చేస్తామని అంటున్నారని దాని వల్ల పెద్దగా అభివృద్ధి జరిగే అవకాశం వుందని నరసింహారావు అన్నారు.