ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. రాష్ట్రంలో అధికారం పోతుందని తెలిసి అవకాశం ఉన్న చోట్ల దండుకోవాలని సీఎం చంద్రబాబు తపనపడుతున్నారని ఆరోపించారు. 

గత ఐదేళ్లలో ఏమీ చేయని సీఎం ఇప్పుడు సమీక్షల వల్ల ఏదో జరుగుతుందంటూ చేస్తున్న ప్రకటనలు చూస్తే నవ్వొస్తొందన్నారు. కరువుతో రైతులు అల్లాడుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు గానీ సమీక్షలు అంటూ నానా హంగామా చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

ఎన్నికల కోడ్‌ పేరిట రాద్ధాంతం చేసి చంద్రబాబు తన ఓటమికి ఇతర సంస్థలను బాధ్యులను చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘంతో చర్చించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆమాత్రం చంద్రబాబుకు తెలియదా అంటూ సెటైర్లు వేశారు. 

రైల్వే జోన్‌ను ప్రకటించే సమయంలో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్న ఆయన కోడ్‌ అమల్లో ఉన్నందున కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని ప్రకటన చేశారని గుర్తు చేశారు. ప్రతీదానికి రాజకీయం చేస్తే ఒత్తిడి పెరుగుతుందే తప్ప సీఎం చంద్రబాబుకు ఏమీ ఒరగదన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.