గుంటూరు: ఏపీ రాష్ట్రంలోని టీడీపీ నేతలకు చెందిన సంస్థలపై  ఆదాయపు పన్ను శాఖాధికారుల దాడుల వెనుక తమ నేతల హస్తం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు  చెప్పారు. 

శుక్రవారం నాడు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. బీజేపీని అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ నేతలు  తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.  టీడీపీ అవినీతి బురదలో కూరుకుపోయిందన్నారు.  ఆ బురదలో బీజేపీని కూడ దించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఐటీ దాడులకు తమకు ఎందుకు సంబంధం ఉంటుందని జీవీఎల్ నరసింహరావు  ఎదురు ప్రశ్నించారు. ఐటీ అధికారులు తమ విధుల్లో భాగంగా దాడులు నిర్వహిస్తే  .. ఆ దాడులను కూడ బీజేపీకి అంటగడ్డం టీడీపీ నేతలకు చెందిందని జీవీఎల్ దుయ్యబట్టారు.

ఏ విషయాన్నైనా రాజకీయం చేయడం టీడీపీ నేతలకు అలవాటేనని జీవీఎల్ అభిప్రాయపడ్డారు.  ఇందులో భాగంగానే ఐటీ దాడుల విషయాన్ని కూడ రాజకీయంగా తమకు అనుకూలంగా ఉపయోగించుకొంటున్నారని  ఆయన విమర్శించారు.