హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. గతంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పిదాలనే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. 

వైసీపీ ప్రభుత్వం తమ తీరుమార్చుకోకపోతే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్లే రాబోయే ఎన్నికల్లో వైసీపీకి వస్తాయని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు ఇకనైనా తమ వైఖరి మార్చుకుని ప్రజలపక్షాన పనిచేయాలని సూచించారు.

గుంటూరు జిల్లాలోని వేమూరులో గాంధీ సంకల్పయాత్రలో పాల్గొన్న సోము వీర్రాజు గ్రామ సచివాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై మండిపడ్డారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం సరికాదన్నారు. 

ప్రభుత్వం తక్షణమే గ్రామ సచివాలయాలకు రంగులు మార్చాలని సూచించారు. గ్రామ సచివాలయాలకు పార్టీల రంగులు వేయడం మంచిపరిణామాలు కాదన్నారు. ప్రజలకు సీఎం జగన్ ఏం సందేశం ఇస్తున్నారని నిలదీశారు. 

మరోవైపు సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేనేత నేస్తం పథకంపైనా సోము వీర్రాజు సెటైర్లు వేశారు. చేనేతకు డబ్బులు ఇవ్వడం కాదని వారి బతుకులు మార్చడానికి కృషి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. 

చేనేతకు గతంలో ఇవ్వాల్సిన రూ.120 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించి వారి జీవితాల్లో ఆనందం నింపాలని ప్రభుత్వాన్ని కోరారు. చేనేత కార్మికుల బకాయిలు విడుదల చేస్తే వారి సమస్యలు దాదాపు పరిష్కరించినట్లేనని చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబు నాయుడుపైనా సోము వీర్రాజు మండిపడ్డారు. ప్రభుత్వ సొమ్ము పప్పు బెల్లంలా పంచిపెట్టడంతో టీడీపీకి 23 సీట్లు వచ్చాయన్నారు. ఇప్పుడు వైసీపీ కూడా అదే పని చేస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కూడా జాగ్రత్తపడకపోతే జగన్‌కూ అదే గతి పడుతుందని సోము వీర్రాజు హెచ్చరించారు.