విశాఖపట్నం: ఏపీలో వలసలపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి పలువురు పార్టీ నాయకులను తమ పార్టీలోకి చేర్చుకున్న బీజేపీ ఇక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఈ ప్రచారానికి ఊతమిస్తున్నట్లుగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలతోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సైతం బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని స్పష్టం చేశారు. 

ఈ నెల 6 నుంచి బీజేపీలో చేరికలు ప్రారంభమవుతాయని తెలిపారు. అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి భారీ సంఖ్యలో వలసలు ఉండబోతున్నాయంటూ కుండబద్దలు కొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీ బలోపేతమవుతుందని తెలిపారు. 

టీడీపీ, వైసీపీతోపాటు ఇతర పార్టీల నుంచి కూడా వలసలు ఉండబోతున్నాయని తెలిపారు. మరోవైపు ప్రజావేదిక కూల్చివేత సరికాదని మాధవ్ అభిప్రాయపడ్డారు. దానిని ప్రజాధనంతో నిర్మించారని, కూల్చివేత కూడా ప్రజాధనంతోనే చేశారని, వీటికైన వ్యయం ఆయా వ్యక్తుల నుంచి రాబట్టాలని డిమాండ్‌ చేశారు. 

విశాఖపట్నంలో జయభేరి సంస్థల భవనాలు కూల్చివేత, టీడీపీ కార్యాలయానికి నోటీసులు వంటి వ్యవహారాలను పరిశీలిస్తే కొందరిని టార్గెట్ చేస్తూ కూల్చివేతకు పాల్పడుతున్నారనే సందేహం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో ప్రభుత్వ భూముల కుంభకోణంపై సిట్‌ ఇచ్చిన నివేదికను అందరికీ తెలిసేలా బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. 

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియాను రద్దు చేస్తోందని అది అన్యాయమన్నారు. తెలుగును అధికార భాషగా, పరిపాలన భాషగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రైవేట్, కొర్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా ఉండకూడదని సూచించారు. గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రైవేట్ కళాశాలలకు, ఆరోగ్యశ్రీ కార్పొరేట్ ఆస్పత్రులకు ఉపయోగపడ్డాయని ఆరోపించారు. 

వాటిపై ఆడిట్ లేకపోవడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఆరోపించారు.  అలాంటివి పునరావృతం కాకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాధవ్ సూచించారు.