రామాయణం గురించి కాస్తో, కూస్తో తెలిసిన వాళ్లకి కూడా... సీతా-రాములకు ఎంత మంది సంతానం అంటే.. లవకుశలు ఇద్దరు అని చెబుతారు. అయితే.. కాదు.. కాదు సీతకి ఒక్కడే కుమారుడు అంటూ ఓ పత్రికలో పేర్కొనడం గమనార్హం. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పత్రిక కావడం విశేషం.

తిరుమల తిరుపతి దేవస్థానం మరో వివాదంలో చిక్కుకుంది. టీటీడీ సప్తగిరి మాసపత్రికలో రామాయణాన్ని వక్రీకరిస్తూ కథనం రాశారంటూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ జానపద కథలో కథనం ప్రచురితమైంది. ఈ కథను తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాశాడు. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

టీటీడీ లాంటి ధార్మిక సంస్థ వాల్మీకి రాసిన రామాయణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జానపదాల్లో రకరకాల ప్రచారాలపై ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రామాయణాన్ని తప్పుదారి పట్టించినట్లు అవుతందని వారు తెలిపారు. మరోవైపు రామాయణాన్ని వక్రీకరిస్తూ టీటీడీ మానసపత్రికలో కథనంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.