మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ని అరెస్టు చేయాలని బీజేపీ  ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. లగడపాటి ఈ రోజు ఉదయం తెలంగాణలో కూటమిదే గెలుపు అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లగడపాటిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయిన వ్యక్తి లగడపాటి అని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి మీడియాలో చిల్లర ప్రచారం చేస్తున్నాడని.. అతనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. లగడపాటి డ్రామా సర్వేలు ఎవరూ నమ్మరన్నారు. లగడపాటిని చంద్రబాబు నడిపిస్తున్నారన్నారు. 

చంద్రబాబు ఏపీలో ప్రజల సొమ్ము దోచుకొని.. ఆ డబ్బుని తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులకు దొరికన డబ్బంతా మహాకూటమి నేతలదేనన్నారు. కూటమి పేరిట దొంగలంతా ఏకమయ్యారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో తమ బీజేపీ పార్టీ కీలక పాత్ర పోషించబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.