వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని  ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.  ఎన్నికల నేపథ్యంలో సోము వీర్రాజు మంగళవారం తిరుపతి జిల్లాలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. 

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. మార్చి 13న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోము వీర్రాజు మంగళవారం తిరుపతి జిల్లాలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు మాట్లాడుతూ.. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కోతలు తగ్గాయని తెలిపారు. మోదీ అంటేనే అభివృద్ధి అని.. మోదీ అంటే అవినీతి రహిత వ్యక్తి అని ప్రశంసించారు.

ఇక ఏపీ‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎవరు అధికారంలో ఉన్నా.. ఆ రెండు కుటుంబాల పాలనే నడుస్తుందని సోము వీర్రాజు చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి లేని అప్పుల రాష్ట్రంగా తయారైందని, వైసీసీ పాలన అంతా అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. గతంలో టీడీపీ చేసిన మాదిరే ఇప్పుడు వైసీపీ అవినీతి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

బీజేపీ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించదని అన్నారు. 10వ తరగతి పాస్ కాని వాళ్లకు కూడా పట్టభద్రుల ఎన్నికల్లో పాల్గొనే విధంగా ఓటు హక్కును రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలించాలని, అదే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం.. పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు.

కాగా, ఇప్పటికే ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఫైనల్‌గా ఎన్నికల బరిలో ఎవరు నిలిచారో తేలిపోయింది. దీంతో అన్ని పార్టీలు ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ కూడా తన అభ్యర్థిని గెలుపించుకోవాలని, భారీ ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది.