Asianet News TeluguAsianet News Telugu

ఉచిత బియ్యాన్ని దేశం దాటిస్తున్నారు.. సొంతవూరిలోనూ జగన్‌కు చీత్కారాలే: బీజేపీ నేత సత్యకుమార్

ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ముఖ్యమంత్రి కూడా సొంత ఊరికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని... సీఎం పులివెందుల వస్తుంటే ప్రొద్దుటూరులో కూడా బారికేడ్లు పెట్టారని ఆయన అన్నారు. ఉచిత బియ్యాన్ని వైసీపీ నేతలు అమ్ముకుంటున్నారని సత్యకుమార్ ఆరోపించారు. 
 

bjp leader satya kumar slams ap cm ys jagan
Author
First Published Sep 30, 2022, 3:01 PM IST

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో మూడు నెలల పొడిగించామన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఆ బియ్యాన్ని దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఏపీకి 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందించామని సత్యకుమార్ తెలిపారు. ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అధికార పార్టీ నేతలు విదేశాలకు ఎగుమతి చేశారని ఆయన ఆరోపించారు. శాసనసభ్యుల సమావేశంలో ముఖ్యమంత్రి ఆత్మస్తుతి, పరనిందకు పాల్పడ్డారని సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడపగడపకు వెళ్తున్న వారికి ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురవుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కూడా సొంత ఊరికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని... సీఎం పులివెందుల వస్తుంటే ప్రొద్దుటూరులో కూడా బారికేడ్లు పెట్టారని సత్యకుమార్ గుర్తుచేశారు. 

ప్రజా వ్యతిరేకత పై ముఖ్యమంత్రి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు. పులివెందులలో కూడా ముఖ్యమంత్రికి 50 శాతం ప్రజలు మాత్రమే మద్దతు ఇస్తున్నట్లు పీకే టీం సర్వేలో వెల్లడైందని సత్యకుమార్ పేర్కొన్నారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఎమ్మెల్యేల పైన నెపం మోపేందుకు యత్నిస్తున్నారని... గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి ఎన్నిసార్లు సమీక్ష చేసినా పనుల్లో పురోగతి లేదని ఆయన ధ్వజమెత్తారు. మూడున్నర సంవత్సరాలలో గృహ నిర్మాణానికి ముఖ్యమంత్రి చేసిందేంటి అని సత్యకుమార్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను ఎందుకు నిర్మించడం లేదని ఆయన నిలదీశారు. 

ALso Read:మూడు రాజధానులతో మైండ్ గేమ్: జగన్ పై సోము వీర్రాజు ఫైర్

కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో కూడా సమాధానం లేదని... గుంటూరులో గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వటం లేదని సత్యకుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా పది శాతం కంటే ఎక్కువ ఇళ్లు నిర్మించలేదని... పులివెందుల నియోజకవర్గంలో 21 వేల ఇళ్లు మంజూరైతే కేవలం 1500 మాత్రమే నిర్మాణం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రాప్ విషయంలో ప్రభుత్వ వైఖరితో రైతులు నష్టపోతున్నారని సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 60 శాతం మాత్రమే ఈ క్రాప్ జరిగిందని... మరి ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థ ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. సూక్ష్మసేద్యానికి కేంద్రం నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించటం లేదని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలోనూ విఫలమైందని సత్యకుమార్ ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios