ఎన్నికల సమయంలోనే పొత్తులపై నిర్ణయం: బీజేపీ నేత పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై విషయమై బీజేపీ నేత పురంధేశ్వరి స్పందించారు. కేంద్ర నాయకత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు.
అమరావతి: ఎన్నికల సమయంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని మాజీ కేంద్ర మంత్రి , బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరి చెప్పారు. పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను జాతీయ నాయకులకు వివరిస్తున్నామన్నారు. పార్టీ అంతర్గత చర్చలను మీడియాకు తాను చెప్పలేనన్నారు.
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందన్నారు. అన్ని రంగాల్లో వైసీపీ సర్కార్ వైఫల్యం చెందిందని ఆమె విమర్శించారు. జగన్ సర్కార్ పై చార్జీషీట్లు నిర్వహిస్తున్న విషయాన్ని పురంధేశ్వరి తెలిపారు. గ్రామం నుండి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ అవినీతిపై చార్జీషీట్ విడుదల చేస్తున్నామన్నారు.జగన్ సర్కార్ పై ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదనేది వాస్తవమన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ లు కూటమిగా పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఈ కూటమిని పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తున్నారు. బీజేపీ అగ్రనేతల వద్ద కూడ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించినట్టుగా ప్రచారం సాగుతుంది. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా చూస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ దిశగా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబుతో ఈ విషయమై చర్చలు జరుపుతున్నారు. రానున్న రోజుల్లో కూడ చర్చలు జరుపుతామని జనసేన ప్రకటించింది.